10 మంది ఎంపీలను జగన్ వదిలించుకుంటారా?
ఏపీ అధికార పార్టీ వైసీపీలో 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే రెబల్ అవగా.. మిగిలిన 21 మంది కూడా వైసీపీ అధినేత సీఎం జగన్‌కు అత్యంత విధేయులుగా ఉన్నారు. అయితే.. వీరిలో చాలా మందిపై స్థానికంగా ప్రజల్లోనే వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి వారు దాదాపు 10 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వీరు కేవలం ఉత్సవ విగ్రహాలు మాదిరిగా ఉన్నారే తప్ప.. అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ తమదైన ముద్ర మాత్రం వేయలేకపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. వీరి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. వారిని మార్చాల్సిందేనని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంటే.. ఆయా ఎంపీల స్థానాల్లో ఇప్పటికే ఉన్నవారికి భారీ సెగ తగులుతోందనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి వారిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, కాకినాడ ఎంపీ వంగా గీత, విశాఖ ఎంపీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొట్టేటి మాధవి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఎంపీలందరికీ ఉన్న కామన్ మైనస్లు ఏంటంటే.. వీరు ఎవరికీ అందుబాటులో ఉండరు.
పార్టీ కేడర్‌ను అస్సలు పట్టించుకోరు. ఉంటే.. ఇంట్లో లేకపోతే.. వివాదాల్లో.. అన్నట్టుగా చాలా మంది ఎంపీలు వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ తమ నియోజకవర్గాలను వదిలేసి.. పొరుగు నియోజకవర్గాల్లో వేలు పెట్టడం.. వివాదాలకు సై అంటూ పబ్బం గడిపేస్తున్నారు. మూడేళ్లలో ఏం చేశారని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఎదురు దాడి చేయడం తప్ప మరేమీ లేదన్న వర్షన్ విన్పిస్తోంది. ఇక మహిళా ఎంపీల విషయానికి వస్తే.. వీరు గ్రామ సర్పంచ్లకు ఎక్కువ.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా విన్పిస్తోంది. ఒక్కరికి కూడా ఏమాత్రం వాయిస్ లేదు. కనీసం.. తమ నియోజవకర్గాల్లో పట్టు కూడా సాధించేలేక పోయారు. ప్రస్తుతం వైసీపీ నేతలు గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తుంటే.. వీరి పాత్ర అంతంత మాత్రంగానే ఉంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిపత్య ప్రదర్శనకు ఎంపీలు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు.. కేవలం ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి పరిమితం అవుతున్నారు. ఫలితంగా.. నియోజకవర్గాల్లో అభివృద్ధి అన్నది కనిపించడం లేదు. మరోవైపు.. వచ్చే ఎన్నికలకు సంబందించి ఎక్కడికక్కడ పార్టీలు సమాయత్తం అవుతుంటే.. వీరు మాత్రం తమ సొంత అజెండాలను అమలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో వీరిందరినీ మార్చేయాలని సీఎం జగన్ డిసైడైనట్టు తెలుస్తోంది.