NewsNews AlertTelangana

తుమ్మల అనుచరుడు కృష్ణయ్యను ఎందుకు చంపారు?

Share with

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, సీపీఎం మాజీ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య వెనుక ఎవరున్నారు? ఆయనను ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలకు సమాధానం కృష్ణయ్య కుటుంబ సభ్యుల మాటల్లోనే లభిస్తోంది. నిజానికి కృష్ణయ్య.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత బాబాయి కుమారుడు. సీపీఎం ఆదిపత్యం ఉన్న ఖమ్మంలో కృష్ణయ్య(60) మూడేళ్ల క్రితం వరకు అదే పార్టీలో కొనసాగారు. అయితే.. గత సర్పంచ్‌ ఎన్నికల్లో సీపీఎం నాయకులతో కృష్ణయ్యకు విభేదాలు తలెత్తాయి. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. దీంతో సీపీఎంకు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహిస్తున్న తమ్మినేని సొంత గ్రామం తెల్దారుపల్లిలోనూ టీఆర్‌ఎస్‌ పుంజుకుంటోంది. ఇప్పుడు తుమ్మల బీజేపీలోకి వెళ్తే ఎర్రకోటను కూల్చి కాషాయ జెండాను ఎగురవేస్తారని సీపీఎం నాయకులు భయపడుతున్నారు. ఒక పార్టీకి రాష్ట్ర నాయకుడిగా ఉన్న తమ్మినేని కుటుంబ సభ్యులు సొంత గ్రామంలోనే రాజకీయంగా వెనుకబడటాన్ని జీర్ణించుకోలేకపోయారు.

తమ్మినేని కుటుంబ సభ్యులకు అక్కడ క్వారీ వ్యాపారం ఉంది. దాన్ని తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. రాజకీయంతో పాటు వ్యాపార విభేదాలు కూడా ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. కృష్ణయ్యను హత్య చేసేందుకు ప్రత్యర్థులు గతంలో చాలాసార్లు రెక్కీ కూడా నిర్వహించారని సమాచారం. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను ఎన్నోసార్లు వేడుకున్నారు. పరిస్థితి బాగాలేదని, జాగ్రత్తగా ఉండాలని తుమ్మల కూడా కృష్ణయ్యను హెచ్చరించారు. తమ్మినేని వీరభద్రం ఆదేశాలతోనే ఆయన సోదరుడు కోటేశ్వరరావు తన భర్త హత్యకు కుట్ర పన్నినట్లు కృష్ణయ్య భార్య మంగతాయి ఆరోపించారు. మొత్తానికి ఇది టీఆర్‌ఎస్‌, సీపీఎం మధ్య రాజకీయ హత్యగా కనిపిస్తున్నప్పటికీ ఇందులో కుటుంబ, వ్యాపార విభేదాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.