InternationalNews

సరిగా పని చేయకుంటే… ఇంటికే

Share with

ప్రస్తుతం గూగుల్‌ ఎంప్లాయిస్‌లపై కత్తి వేలాడుతోంది. ఏ క్షణంలోనైనా భారీగా ఉద్యోగులను తొలగించుకునేందుకు గూగుల్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగుపర్చుకొని అంచనాలను అందుకోలేకపోతే భవిష్యత్తులో కంపెనీలో కొనసాగే అవకాశం ఉండదని ఉద్యోగులను గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. కంపెనీలో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, అయితే చాలా తక్కువ మంది పని చేస్తున్నారన్నారు. టాప్‌ గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తమ ఉద్యోగుల పని తీరును చూపించాలని.. లేదంటే ఇంటికి వెళ్లేందుకు రెడీగా ఉండాలని కూడా హెచ్చరించారు.  

అసలు విషయానికి వస్తే.. గూగుల్‌ కంపెనీలో ఉద్యోగుల తొలగింపులు జరుగుతాయో లేదా అనేది తదుపరి త్రైమాసిక ఆదాయాలపై ఆధారపడి ఉంటుందని గూగుల్‌ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే గూగుల్‌ క్లౌడ్‌ సేల్స్‌ విభాగంలో పనిచేస్తున్న గూగుల్‌ ఉద్యోగులను సాధారణంగా విక్రయాల ఉత్పాదకతను పెంచేలా బాగా కష్టపడి పనిచేయాలని సూచించింది. వచ్చే త్రైమాసిక ఫలితాల్లోగా ఉద్యోగుల పని తీరు కనుక బాగా లేకుంటే విధుల్లో నుంచి తొలగింపులు తప్పవని నివేదించింది.  మరోవైపు ఉద్యోగుల భయాలను మరింత పెంచేలా గూగుల్‌ నియామకాలను ఈ నెల కూడా నిలిపివేసింది. దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఇతర టెక్‌ కంపెనీలైన నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి అనేక ఇతర పెద్ద టెక్‌ దిగ్గజాలు తమ ఉద్యోగుల్లో కోతలను కూడా విధించాయి. అలాగే మైక్రోసాఫ్ట్‌ ఇటీవల దాదాపు 2000 మంది ఉద్యోగులను కూడా తొలగించింది.  వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను సాగనంపాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్‌ బర్గ్‌ కూడా పనితీరు సరిగా లేని ఉద్యోగులను తొలగించుకుంటుందని పేర్కొన్నారు. ట్విట్టర్‌ కూడా ఉద్యోగుల నియామకాలను నిలిపివేసింది. ఇప్పుడు గూగుల్‌ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమవుతోంది.