NewsTelangana

కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలంటున్న జనం

Share with

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తెలంగాణ జనం కోసం ఏమిచ్చింది? కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేముంది? మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో విన్పిస్తున్న ప్రశ్నలివి. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి… ఎమ్మెల్యే పదవిని వదిలేసుకున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గ్రౌండ్ రియాల్టీ తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని భావించారు. వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ సచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికలనూ ఆ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. సరికదా… కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ నేతలు తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లరన్న గ్యారెంటీ కూడా ఏమీ లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకునేవారు నేరుగా ఇతర పార్టీలకు ఓటేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో పుట్టి.. కాంగ్రెస్ పార్టీలోనే పెరిగిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇద్దరు సోదరులు కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో అండగా నిలవడమే కాకుండా… పార్టీకి ఊపు సైతం తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి ఆశించి భంగపడ్డ బ్రదర్స్ తలోదారి చూసుకున్నట్టుగా కన్పిస్తున్నా… ఆ విషయంలో కూడా ఇంకా ఎంతో అస్పష్టత దాగుంది. మొత్తం వ్యవహారంపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. 135 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న హస్తం పార్టీకి రేవంత్ లాంటి నాయకుడ్ని పీసీసీ చీఫ్ చేయడమేంటని రాజగోపాల్ రెడ్డి మొదట్నుంచి ప్రశ్నిస్తూ వచ్చారు. మరో సోదరుడు వెంకట్ రెడ్డి సైతం తనకన్నా పీసీసీ చీఫ్ ఇవ్వకపోతారా అని భావించారు. కానీ అది కూడా జరగలేదు. దీంతో చేసేదేం లేక ఆయన సైలెంట్ అయిపోయారు. కానీ మునుగోడు నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం… తాను నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానన్న వర్రీలో ఉన్నారు. కనీసం రాజీనామా చేస్తే నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తారని.. పథకాలు లభిస్తాయని భావించారు. కేసీఆర్ సీఎం అయ్యాక… కేవలం కొన్ని నియోజకవర్గాలకే పైసలు విదుల్చుతున్నారని… విపక్షాల నియోజకవర్గాలను అసలే పట్టించుకోవడం లేదని తాజాగా రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఓడినా రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడు నుంచి 22, 552 ఓట్లతో జయభేరి మోగించారు. గతంలో ఏ కాంగ్రెస్ నేతకు రానంత మెజార్టీ ఆయనకు వచ్చింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు.. మరోవైపు కేసీఆర్ తీరుతో అలసిపోయిన రాజగోపాల్ రెడ్డి.. ఉపఎన్నికలకు వెళ్తే… రాజకీయాలు ఎలా ఉన్నా.. సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఆధ్వర్యంలో పనిచేయడం ఇష్టం లేకనో.. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు సరైన పార్టీ బీజేపీయేనని భావించైనా ఉండొచ్చు. ఇలాంటి తరుణంలో రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒనగూరేదేముంది? కాంగ్రెస్ పార్టీకి కోమటరెడ్డి బ్రదర్స్‌ను ఆడిపోసుకోవడం వల్ల కలిగే లాభం ఏముంది? రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనైనా హస్తం పార్టీ తమను తాము దిద్దుకోవాలి… 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 14 మంది పార్టీ ఫిరాయించారు. తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో గెలిచిన స్థానం అక్కర్లేదని ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఇచ్చామని జబ్బలు చరుచుకునే పార్టీ ఈ రోజు తెలంగాణలో అస్తిత్వ సంక్షోభంతో తల్లడిల్లుతోంది. ఓవైపు కేసీఆర్ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంటే.. తెలంగాణలో ఎట్టి స్థితిలో గెలిచి తీరాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రాజగోపాల్ రెడ్డిని విమర్శిస్తూ టైమ్ పాస్ చేసుకుంటోంది. ఇదీ తెలంగాణలో కన్పిస్తున్న దృశ్యం.