ఐటీ దాడుల్లో రూ. 390 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
పన్ను ఎగవేత ఆరోపణలతో …మహరాష్ట్రలో కొన్ని వ్యాపార సంస్ధలకు సంబంధించిన ఇళ్లు,కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. దాదాపు రూ. 390 కోట్ల మేర ఖాతాలో చూపని ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులలో రూ. 56కోట్ల నగదు లభ్యమవ్వగా రూ.14కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును లెక్కించడానికి ఏకంగా 13 గంటల సమయం పట్టింది. దీంతో పాటు వందల కోట్ల విలువైన బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….మహరాష్ట్రలోని జల్నాలో స్టీల్, వస్త్రాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రెండు వ్యాపార సంస్ధలు గత కొన్ని సంవత్సరాలుగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 8 వరకు 260 మంది అధికారులు ఐదు బృందాలుగా ఏర్పాడి విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో 120కి పైగా వాహనాలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం నోట్ల కట్టలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.