Andhra PradeshHome Page Slider

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ఇప్పుడే వైసీపీకి ఎందుకు గుర్తుకొచ్చింది?

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రెండేళ్లు ఉండాలని వైవీ సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడారా? ఎన్నికల ముందే ఇలాంటి ప్రచారం ఎందుకు? కేసీఆర్ సీఎంగా ఉన్నన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారా? వైవీ వ్యాఖ్యల్లో మర్మమేంటి? ఓవైపు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడమేంటని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీపై దూకుడు పెంచగా.. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్‌పై చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి చూపు రెండు పార్టీలపై పడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ మొత్తం వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారు?

మరో రెండేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి. హైదరాబాద్ పై హక్కు మరో రెండేళ్లు పొడిగించండి. కేంద్రానికి తాజాగా వైసీపీ ముఖ్యనేత, జగన్ అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నోటి వెంట వచ్చిన మాటలు కాకరేపుతున్నాయి. వైవీ వ్యాఖ్యలు అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రలో కలకలం సృష్టించాయి. వాస్తవానికి హైదరాబాద్ నుంచి ఏపీ సర్కారు 2014-16 మధ్య పూర్తి స్థాయిలో ఏపీకి షిఫ్ట్ అయిపోయింది. గత ఏడేళ్లుగా ఏపీ వ్యవహారాలు తెలంగాణలో దాదాపు శూన్యం. ఒకటి, అరా కార్యాలయాలు ఉన్నా.. అవి కేవలం నామ్ కే వాస్త్ తప్పించే మరేం కాదు. ముఖ్యంగా ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు ఆయన వచ్చిందీ కూడా లేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో కేసీఆర్‌తో చర్చల సమయంలోనే హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత పెద్దగా తెలంగాణకు వచ్చిందీ కూడా ఏం లేదు. ఏపీ సర్కారు మూడు రాజధానులంటూ ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చింది. అమరావతి,వైజాగ్, కర్నూలు అంటూ ఇన్నాళ్లూ చెప్పింది. ఆ తర్వాత కార్యనిర్వహక రాజధాని వైజాగ్ వెళ్తున్నట్టుగా ప్రభుత్వం పెద్దలు ప్రకటనలు గుప్పించారు. కానీ కోర్టు వివాదాలతో ముందడుగుపడలేదు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా గుంటూరు, విజయవాడ కేంద్రంగానే కొనసాగుతున్నాయ్. వైజాగ్‌కి ఒకటీ అరా వెళ్లినా.. పాలన అంతా విజయవాడ కేంద్రంగానే సాగుతోంది. తెలంగాణ టిడిపి హయాంలోనే తట్టాబూట్టా సద్దేసుకున్న ఏపీ సర్కారు ఇప్పుడు కొత్తగా ఈ వాయిస్ వినిపించడం వెనుక ఏముందన్న భావన వ్యక్తమవుతోంది. ఏపీ సర్కారు పూర్తిగా అటు అమరావతి ఇటు వైజాగ్ నడుమ తిరుగుతుందనుకుంటున్న సమయంలో కావాలనే గ్రేటర్ హైదరాబాద్ వైపు వైసీపీ నాయకులు తొంగి చూడటం వెనుక రాజకీయముందా అన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందా… అంటే లేనేలేదు. అధికారులు ఉండే అవకాశం లేదు. రెండు రాష్ట్రాలు, ఎవరి దారిలో వారు సాగుతున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వైవీ సుబ్బారెడ్డి ఏపీని మరో రెండేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరడం వెనుక అసలు ఉద్దేశమేంటా అన్నది త్వరలోనే తేలే అవకాశం ఉంది.

వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేనప్పటీ… ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌కు హైదరాబాద్ ఇప్పుడు ఆదరువుగా ఉంది. ఏపీలో పరిశ్రమలు, అవకాశాలు లేకపోవడంతో రాష్ట్ర విభజనకు పూర్వమే, రాయలసీమ, కోస్తా ప్రజలు హైదరాబాద్‌‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకున్నారు. గత పదేళ్లుగా రెండు ప్రాంతాల మధ్య వివాదాలు, విభేదాలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయ్.. ఇంతలో KRMBకి తెలంగాణ ప్రాజెక్టులు ఎలా అప్పగిస్తారంటూ రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ దూకుడు పెంచింది. నల్గొండ వేదికగా కేసీఆర్ దూకుడు ప్రదర్శించారు. రేవంత్ సర్కారు చేతకాకుంటే, తనను అడగాలని.. అంతేగానీ తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని హితవు పలికారు. అటు KRMB, ఇటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై వైసీపీ ముఖ్య నేత వ్యాఖ్యలు రచ్చకు కారణమవుతున్నాయి.