కరీంనగర్ అడ్డా ఎవరిది?
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు విజయం సాధించి హాట్రిక్ విజయాలతో దీమాగా ఉన్న గంగుల కమలాకర్ మరోసారి గెలుపుపై దీమాతో ఉన్నారు. 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఈసారి అటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్, బీజేపీ నేత బండి సంజయ్ నుంచి హోరాహోరీ పోటీని ఎదుర్కొంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బండి సంజయ్ ఆ తర్వాత కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ చీఫ్‌గానూ ప్రమోట్ అయ్యారు. అయితే ఎన్నికలకు ముందు ఆయనను మార్చడంతో సింపథీ వర్కౌటవుతుందా అన్న అనుమానం ఉంది. కానీ, నియోజకవర్గంలో ముగ్గురు మున్నూరు కాపు సామాజికవర్గం నేతలు బరిలో నిలుచుండటంతో ఈసారి ఎవరికి విజయం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెరుమల్ల శ్రీనివాస్ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడ్నుంచి మూడు పార్టీల నేతలు గెలుపుపై దీమాతో ఉండగా… నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావతం చూపనున్నాయ్. అటు గంగుల కమలాకర్, ఇటు బండి సంజయ్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న తరుణంలో సైలెంట్‌గా జెండా ఎగురేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ దీమా ప్రదర్శిస్తున్నారు.

కరీంనగర్ పోలింగ్ బూత్‌ల సంఖ్య 390. పురుష ఓటర్లు 1,71,254, మహిళా ఓటర్లు 1,70,615 మంది కాగా ట్రాన్స్‌జెండర్లు 44 మంది ఉన్నారు. ఇక మొత్తం ఓటర్లు 3,41,913 ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారు మొత్తం ఓటర్లలో 20 శాతం వరకు ఉన్నారు. ఇక మాదిగలు 13 శాతం, మున్నూరు కాపులు 10 శాతం వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైశ్యులు సైతం ఎనిమిదిన్నర శాతం ఉన్నారు. గౌడలు, పద్మశాలీలు 7 నుంచి 8 శాతం వరకు ఉన్నారు. మాలలు 7 శాతం, గొల్ల-కురుమలు ఐదున్నర శాతం ఉండగా, రెడ్లు 5 శాతానికి పైగా ఉన్నారు. ఇక ఇతరులు 12 నుంచి 14 శాతం మధ్యలో ఉన్నారు.

