ముధోల్‌లో జెండా పాతేదెవరు?
ఆదిలాబాద్ జిల్లాలో హిందుత్వం బలంగా ఉన్న జిల్లాల్లో ముధోల్ ఒకటి. మత ఘర్షణలకు కారణమైన బైంసా ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ్నుంచి గతంలో విజయం సాధించిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మరోసారి బరిలో నిలవగా ఇక్కడ్నుంచి కాంగ్రెస్ పార్టీ నారాయణరావ్ ను పోటీకి దించింది. ఇక బీజేపీ ఇక్కడ్నుంచి రామారావు పటేల్ ను పోటీకి నిలిపింది. గతంలో ఇక్కడ్నుంచి పోటీ చేసిన రమాదేవికి బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆమె బీఆర్ఎస్ గూటికి చేరారు. మొత్తంగా ముథోల్ నియోజకవర్గంలో జెండా ఎగురేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే.. ఆ పార్టీని నిలువరించాలని అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయ్. ముధోల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ముగ్గురు కత్తులు దూసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు కాంగ్రెస్ టికెట్ లభించగా, ఆయన బంధువు రామారావు పటేల్ ముధోల్ నుంచి బీజేపీ తరఫున నామినేషన్ వేశారు.

ముధోల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 311 పోలింగ్ బూత్‌లు ఉండగా పురుష ఓటర్లు 1,19,910,స్త్రీ ఓటర్లు 1,26,102, ట్రాన్స్‌జెండర్లు 18, మొత్తం ఓటర్లు 2,46,030 ఉన్నారు. ముధోల్ నియోజవర్గంలో మున్నూరు కాపులు, ఇతర బీసీలు మొత్తం 30 శాతానికి పైగా ఉన్నారు. ఒక్క మున్నూరు కాపు సామజిక వర్గం ఓటర్లు 15 శాతం వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు పదకుండన్నర శాతం వరకు ఉన్నారు. మాదిగలు 7 శాతం, మాలలు 6 శాతం, ఇతర ఎస్టీలు 6 శాతం, ఇతర ఓసీలు నాలుగున్నర శాతం, యాదవులు 4 శాతం, పద్మశాలీ 4 శాతం, తెనుగు ఓటర్లు 3 శాతం ఉన్నారు. ఇతర ఓటర్లు సుమారుగా 20-25 శాతంగా ఉన్నారు.

