NationalNews Alert

భర్త మరణంతో క్రుంగిపోక, వేలకోట్ల అప్పులను తీర్చిన ధీరవనిత

ఆమె పుట్టుకతోనే అదృష్టవంతురాలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె. ప్రముఖ వ్యాపారవేత్త భార్య. కానీ కాలం పామై కాటు వేసింది. ఆనందంతో సాగిపోతున్న ఆమె జీవితంలో గాఢాందకారం అలముకుంది. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్త వ్యాపారంలో అప్పుల బాధ తాళలేక అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి ఇంకా అందిరాని పిల్లలు. దారి,తెన్నూలేని వ్యాపారం. దాని వెనుక ఎంతోమంది నిస్సహాయులైన ఉద్యోగులు. వేలకోట్ల అప్పులు. ఇది కథ కాదు నిజం. ఇది కేఫ్ కాఫీ డే CEO మాళవిక హెగ్డే జీవిత కథ.

అనుకోని కష్టాలను తట్టుకొని, తాను నిలబడి, తన సంస్థను కూడా ముందుకు నడిపిస్తున్న ఆమె కథ  నేటి ఆధునిక మహిళలకు స్ఫూర్తిదాయకం.

మాళవిక పుట్టి పెరిగినదంతా బెంగళూరే. ఆమె తండ్రి S.M. KRISHNA కర్ణాటకకు మాజీ ముఖ్యమంత్రి. ఆమెకు 1991 లో COFFEE DAY వ్యవస్థాపకుడు V.G. SIDDHARTH తో వివాహం జరిగింది. ఈ కాఫీ డే ఆలోచనను సిద్ధార్థ్ చెప్పినప్పుడు ఆమెకు ఈ వ్యాపారం అంత లాభసాటి కాదనిపించిందట. ఎందుకంటే బయట బంకుల్లో 5 రూపాయలకు దొరికే కాఫీని 25 రూపాయలు పెట్టి ఎందుకు తాగుతారనేది ఆమె అనుమానం. అయితే రకరకాల స్కీములను పెట్టి, ఉచిత ఇంటర్నెట్‌ను అందిస్తూ సిద్ధార్థ్ ఈ వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి  చేసి వేలకోట్ల టర్నోవర్‌కు పెంచారు. అంతా సవ్యంగా జరుగుతుందని సంబరపడుతున్న వేళ, అప్పులు విపరీతంగా పెరిగిపోయి, కాఫీ కింగ్‌గా పేరుపొందిన ఆయన ఒత్తిడి తట్టుకోలేక అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారు. సంస్థ దివాలా తీసేసే పరిస్థితికి వచ్చింది. దాదాపు 24 వేలమంది ఉద్యోగులు రోడ్డున పడబోతున్నారు. ఆసమయంలో తన బాధను పక్కనపెట్టి, సంస్థ పగ్గాలు చేపట్టారు మాళవిక. తన భర్త జ్ఞాపకంగా తనకు మిగిలిన వ్యాపారసామ్రాజ్యాన్ని కూడా తన బిడ్డల బాధ్యతతో పాటు సమానంగా తీసుకున్నారు. 2020 లో కాఫీడే సీఈవోగా బాధ్యతలు తీసుకున్న ఆమెకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ముందుగా అప్పుల బాధను తట్టుకోడానికి సంస్థ నిరర్థక ఆస్తులను అమ్మేశారు. ఒక ఏడాది కాలంలో చాలావరకు అనవసర ఖర్చులను తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నారు. నెమ్మదిగా ఉద్యోగులలో ఆమె మీద విశ్వాసం పెరిగింది. ఉద్యోగుల భద్రతకు కూడా చాలా భరోసా ఇచ్చింది. సంస్థ భవిష్యత్ ప్రణాళికలు చాలా స్పష్టంగా రూపొందించింది. టాటాగ్రూప్ వంటి సంస్థలతో పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ క్రమంలో కాఫీడే సంస్థకు అప్పులు చాలా తగ్గాయి. ఈ సంవత్సరం  మార్చి 31 నాటికి  7214 కోట్ల రూపాయల అప్పులను, 1810 కోట్ల రూపాయలకు చేర్చిందామె.

ఆమెకు భర్తపై గల ప్రేమ, బాధ్యత, ధైర్యం, తెగువలకు ఎన్నో ప్రశంసలు లభించాయి. బ్యాంకులకు వేలకోట్లు ఋణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వాంటి వాళ్లున్న ఈ దేశంలో భర్త  చనిపోయినా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని భుజాన వేసుకుని ఉద్యోగులు వీధిన పడకుండా, అప్పులను తలపై వేసుకుని సంస్థకు పూర్వ వైభవం తేవాలని కృషిచేస్తున్న ఆమెకు HATSOFF చెప్పాల్సిందే.