‘మంకీపాక్స్, కొవిడ్‌లలో ఏది ప్రమాదం’..WHO ఏం చెప్తోంది..
మంకీపాక్స్ అతి ప్రమాదకరమైన వైరసేనని WHO ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. కోతుల నుండి బయటపడిన ఈ వైరస్‌కు మంకీపాక్స్ అని నామకరణం చేశారు. కోతులకు, ఇతర జంతువులకు దూరంగా ఉండమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ మహమ్మారిని ఇంకా ప్రజలు మరిచిపోలేదు. లక్షలాది ప్రాణాలు బలితీసుకున్న కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజానీకానికి ఈ మంకీపాక్స్ మరో సవాల్ విసురుతోంది. ఆఫ్రికాలో పుట్టి ఆసియాకు కూడా పాకిందీ వైరస్. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి.
క్లాడ్1, క్లాడ్ 2 అనే వేరియంట్స్‌తో విరుచుకుపడుతోంది మంకీ వైరస్. ఈ వ్యాధిని 1958లోనే కనిపెట్టినా, 2022 నుండి వేగంగా విస్తరిస్తోంది. కేవలం రెండేళ్లలోనే అనేక దేశాలలో ప్రాణాలు బలిగొంది. దీనిని నిర్లక్ష్యం చెయ్యెద్దని ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. క్లాడ్ 1 వేరియంట్ వల్ల ప్రాణానికే ప్రమాదం కలిగే పరిస్థితి రావచ్చంటున్నారు వైద్యులు.

ఈ వ్యాధి సోకిన 21 రోజులలోగా లక్షణాలు బయటపడతాయి. గొంతునొప్పి, తలనొప్పి, ఒంటిపై దద్దుర్లు, జ్వరం దీని లక్షణాలు.
మనిషి నుండి మనిషికి, జంతువుల నుండి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. ఒకనొకరు తాకినా, చర్మాన్ని తాకడం ద్వారా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ సులభంగా సోకుతుంది.
పీసీఆర్ టెస్ట్ ద్వారా ఈ వ్యాధిని నిర్థారణ చేయవచ్చు. గర్భిణులు, హెచ్‌ఐవీ వంటి వ్యాధి బాధితులకు ఇది ఈజీగా సోకవచ్చు. చర్మంపై ఏర్పడిన పుండ్లలోని ద్రవాల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకవచ్చు. ఇది చికెన్ ఫాక్స్ వంటి లక్షణాలు కలిగి ఉన్నా, కొవిడ్ లాగ వ్యాపించే లక్షణాన్ని కూడా కలిగి ఉంది. నోటిలోని ద్రవాల ద్వారా కూడా సోకుతుంది. కాబట్టి ఈ వ్యాధి సోకిన వారిని ఐసోలేషన్‌లో పెట్టవలసిన అవసరం ఉంది.

ప్రస్తుతం ఈ వ్యాధిని రాకుండా నివారించేందుకు ఎంబీఏ-బీఎన్, ఆర్ధోపాక్స్ వ్యాక్స్, ఎల్‌సీ 16 అనే 3 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వ్యాధిసోకే అవకాశమున్న ఆరోగ్య కార్యకర్తలు వంటి వారికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
కొవిడ్ వలెనే దీనికి కూడా ప్రత్యేక నివారణోపాయాలు పాటించాలి. శరీరంపై పుండ్ల ద్వారా ద్రవాలు ఇతరులకు సోకకుండా విడిగా గదులు కేటాయించాలి. మాస్క్ ధరించాలి. వారి దుస్తులు విడిగా ఉతుక్కోవాలి.
నోటిలో పుండ్లు ఉంటే ఉప్పు నీటితో పుక్కిలించాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే మందులు వాడాలి.

