రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?
పార్టీలో తనను ఒంటరిని చేస్తున్నారంటూ రేవంత్ కంటతడి
సీనియర్ల కుట్రతో టీపీసీసీ అధ్యక్ష పదవికి ఎసరు అని భయం
తమ్ముడిని గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులను కోరిన వెంకట్‌రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్
మునుగోడులో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం ఓ వైపు టీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీ హోరాహోరీ పోరాడుతున్నాయి. కానీ.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక కాంగ్రెస్ తంటాలు పడుతోంది. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాలు మునుగోడు సాక్షిగా బట్టబయలయ్యాయి. మునుగోడులో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైందని స్పష్టమైన నేపథ్యంలో ఆ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోరాటం పతాక స్థాయికి చేరుకుంది. అందులో భాగంగానే మీడియా ముందు రేవంత్ కంటతడి.. అంతలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్.. అంతా టీపీసీసీ అధ్యక్ష పదవి చుట్టే తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

నాకు పీసీసీ పదవిపై సీనియర్ల గుర్రు: రేవంత్
తనను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలే సీఎం కేసీఆర్‌తో కలిసి కుట్ర పన్నుతున్నారని రేవంత్ రెడ్డి గురువారం మీడియా ముందు వాపోయారు. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి రావడంపై కాంగ్రెస్‌లోని సీనియర్లు గుర్రుగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో తనను ఒంటరిని చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల పోరాటంలో సీనియర్ నాయకులు కలిసి రావడం లేదని, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఎవరూ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అభ్యర్థి ఎంపిక నుంచే కుట్ర..
కాంగ్రెస్‌లో రేవంత్‌పై కుట్ర మునుగోడు ఉప ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేయడంతోనే ప్రారంభమైంది. రియల్టర్ చిల్లమల్ల కృష్ణారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇప్పించాలని.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి కృష్ణారెడ్డి గట్టి పోటీ ఇస్తారని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. అయితే.. సీనియర్లంతా పట్టుబట్టి పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించారు. అప్పుడే కాంగ్రెస్ సగం ఓటమిని అంగీకరించిందని ప్రచారం జరిగింది. స్రవంతిని దగ్గరుండి గెలిపించుకుంటామని అధిష్టానం ముందు మాటిచ్చిన సీనియర్లు ప్రచారంలో మాత్రం అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. పైగా ఓటమి నెపాన్ని రేవంత్ రెడ్డిపైకి నెట్టి ఆయనను బలిపశువును చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన రేవంత్ మీడియా ముందు కంటతడి పెట్టి పార్టీ శ్రేణుల్లో సానుభూతి సంపాదించి.. అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది.

తమ్ముడిని గెలిపించాలని వెంకట్‌రెడ్డి ఫోన్..
నియోజక వర్గంలో మంచి పట్టున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా స్రవంతికి టికెట్ ఇస్తేనే ప్రచారం చేస్తానన్నారు. ఇప్పుడు మాత్రం ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. పైగా.. తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తలకే ఫోన్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల తర్వాత రేవంత్ స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపడతానని.. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తానని.. ఇప్పుడు మాత్రం పార్టీలను పట్టించుకోకుండా తన తమ్ముడిని గెలిపించాలని ఫోన్‌లో చేప్పారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ శుక్రవారం లీక్ కావడంతో వెంకట్‌రెడ్డి చక్రబంధంలో చిక్కుకున్నారు.

కేసీఆర్ డబుల్ బొనాంజా..
నిజానికి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లగానే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిని మునుగోడు వ్యూహాలకు దూరంగా ఉంచి కాంగ్రెస్ విజయానికి రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్ చేశారు. కానీ.. సీనియర్లు రేవంత్‌కు అడ్డు తగిలారు. అధిష్టానం కూడా సీనియర్ల మాటకే విలువ ఇచ్చింది. వాళ్లు మాత్రం రేవంత్‌ను బలి పశువును చేసేందుకు స్కెచ్ వేశారు. ఈ ఎత్తుకు పై ఎత్తుల్లో చివరికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతోంది. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తోంది. ఈ దెబ్బతో కేసీఆర్‌కు డబుల్ బొనాంజా దక్కనుంది. ఒకటి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. బీజేపీ పుంజుకుంటోంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్ గెలుస్తుంది. రెండోది.. తన చిరకాల ప్రత్యర్థి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లోనూ గుర్తింపు లేకుండా పోతోంది. దీంతో రేవంత్ రెంటికి చెడ్డ రేవడిగా మారతారు. ఇదీ కేసీఆర్ స్కెచ్.

