Home Page SliderInternational

తెలంగాణ ప‌ర్యాట‌కాన్ని స‌రికొత్త‌గా ప్ర‌పంచానికి తెలియ‌జేస్తాం: మంత్రి

తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని… ద‌ర్శ‌నీయ గ‌మ్య‌స్థానంగా మారుస్తామ‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. థాయిలాండ్ రాజధాని  బ్యాంకాక్ లోని క్వీన్ సిరికిట్ నేష‌నల్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో నిర్వ‌హిచిన (QSNCC)   పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్  – PATA Travel Mart (PTM)  లో ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పాల్గొన్నారు. 45 దేశాలకు చెందిన 900 మంది  ప్రతినిధులు దీనికి హాజరవ్వగా.. భారత్‌ నుంచి  తెలంగాణ‌తో పాటు 5 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. ఈ ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ ప‌ర్యాక‌ట శాఖ  ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్‌ను మంత్రి జూప‌ల్లి ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు చారిత్రక, వారసత్వ క‌ట్ట‌డాలు, ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, స్థలాల ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ పర్యాటక సంస్థ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించేలా నాగర్జున సాగ‌ర్ లోని బుద్ద‌వ‌నం, హైద‌రాబాద్ లోని చార్మినార్, ములుగు జిల్లాలోని ల‌క్న‌వ‌రం తీగ‌ల వంతెన  ఛాయా చిత్రాల్ని ప్రదర్శించింది.

తెలంగాణలోని యునెస్కో గుర్తింపు పొందిన‌ రామప్ప దేవాలయం, గోల్కొండ కోట,  వరంగల్ కోట, కాక‌తీయ తోర‌ణం,  చార్మినార్, కుతుబ్ షాహీ టోంబ్స్, ఆసియా ఖండంలో అతిపెద్ద బుద్ధిజం ప్రాజెక్ట్ బుద్ధవనం, వేయి స్తంభాల గుడి, ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన పోచంపల్లి వంటి ప్రఖ్యాత పర్యాటక ప్ర‌దేశాల‌ను చూసేందుకు ‘మీరంతా తెలంగాణ‌ రండి’ అని ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి వారిని ఆహ్వానించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు, వారసత్వాన్ని కాపాడుకునేందుకు థీమ్ ఆధారిత బుద్దిస్ట్ సర్క్యూట్,  హెరిటేజ్ సర్క్యూట్ మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పర్యాట‌కుల‌ను ఆక‌ర్షించి పరస్పర ప్రయోజనం పొద‌డమే ల‌క్ష్యంగా  పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ ట్రావెల్ మార్ట్  ను నిర్వ‌హిస్తున్నారు.  ఆగ‌స్టు 27 నుంచి 29 వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఘనమైన  తెలంగాణ‌ చరిత్ర, సంస్కృతి, వారసత్వ కేంద్రంగా పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలికవసతుల కల్పనతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.