‘మాకు 70కి 55 రావడం ఖాయం’..కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీకి రేపే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో ఆప్ పార్టీయే మరోసారి అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో 70 సీట్లకు గాను, 55 సీట్లను తమ పార్టీ గెలుచుకుంటుందని పేర్కొన్నారు. ఒకవేళ బీజేపీ ఢిల్లీ ఎన్నికలలో గెలిస్తే, ఇక ఢిల్లీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందవన్నారు. తన ఎక్స్ ఖాతాలో మహిళలకు విజ్ఞప్తి చేశారు. మహిళలు కూడా ముందుకొచ్చి పురుషుల చేత ఓట్లు వేయిస్తే, 60 సీట్ల పైన తమ పార్టీ గెలుచుకుంటుందని పేర్కొన్నారు. ఇక్కడ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఇస్తున్నామని, పైగా 400 యూనిట్లకు, రూ.800 మాత్రమే వసూలు చేస్తున్నామని, అలాగే 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. అందుకే చీపురు గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలన్నారు. కమలానికి ఓటు వేస్తే, మీరు ఇంటికి వెళ్లేసరికి కరెంట్ పోవడం ఖాయమన్నారు.

