NewsNews AlertTelangana

తెలంగాణాపై వైరస్‌ పంజా

ఓ వైపు వర్షాలు.. మరోవైపు చలి.. ఇంకోవైపు ఎండలు.. తెలంగాణాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ఫ్లూ వైరస్‌ విజృంభిస్తోంది. ఇటీవల డెంగీ, స్వైన్‌ ఫ్లూ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నట్లు హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండ్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. ఆస్పత్రికి వచ్చే డెంగీ అనుమానిత కేసుల్లో 60-80 శాతం పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 3109 డెంగీ కేసులు నమోదయ్యాయి. మంచి నీటిలో పెరిగే `ఎడిస్‌ ఈజిప్టి` దోమలు కుట్టడం వల్ల డెంగీ వ్యాపిస్తుంది. ఈ దోమ పగటి పూటే కుడుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో డెంగీ కేసులు మామూలే. కానీ.. ఈసారి మాత్రం స్వైన్‌ ఫ్లూ కేసులు కూడా వెలుగు చూడటం విశేషం.

బలహీనపడిన స్వైన్‌ ఫ్లూ వైరస్‌

స్వైన్‌ ఫ్లూ వైరస్‌ బలహీనపడిందని.. అయితే పూర్తిగా అంతరించిపోలేదని డాక్టర్‌ శంకర్‌ పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం స్వైన్‌ ఫ్లూ తొలిసారి వెలుగులోకి వచ్చినప్పుడు పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. వర్షాలు, వరదలు, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయన వైద్య శాఖను జూలై నెలలోనే అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో డయాగ్నస్టిక్స్‌ కేంద్రాలు 24 గంటలు పనిచేయాలని, పరీక్షా ఫలితాలను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని.. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని.. కాచి వడపోసిన నీటిని తాగాలని వైద్యులు సూచించారు.