Home Page SliderNational

జైళ్లో నటుడు దర్శన్‌కు వీఐపీ ట్రీట్మెంట్…చిక్కుల్లో అధికారులు

కన్నడ నటుడు దర్శన్ తూగుదీప కస్టడీలో ఉన్నప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ పొందుతున్నట్లు ఫోటోలు వైరల్ కావడంతో కర్నాటకలో రచ్చరచ్చకు కారణమవుతోంది. వైరల్ ఫోటో, వీడియోపై దర్యాప్తు తర్వాత ఏడుగురు బెంగళూరు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. “పోలీసులు విచారించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా, ఏడుగురు అధికారుల ప్రమేయం ఉందని గుర్తించారు. వారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ విషయాన్ని మరింత లోతుగా విచారిస్తున్నాం. ఇది తీవ్రమైన భద్రతా లోపం” అని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర్ అన్నారు.

రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ ఫోటో ఆన్‌లైన్‌లో రావడంతో వివాదం మొదలైంది. నటుడిని కుర్చీలో కూర్చొని, సిగరెట్, కాఫీ కప్పును పట్టుకుని, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. దర్శన్‌తో కనిపించిన వారిలో క్రిమినల్ విల్సన్ గార్డెన్ నాగ, అలాగే నటుడి మేనేజర్, సహ నిందితుడు నాగరాజ్, మరో ఖైదీ కుల్లా సీనా ఉన్నారు. అంతేకాకుండా, దర్శన్ ఒకరితో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నట్లు వీడియోలో కన్పించింది.

పోలీసులు దర్శన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని రేణుకాస్వామి తండ్రి కాశీనాథ్ ఎస్ శివనాగౌడ్రు డిమాండ్ చేశారు. ఇలాంటి వాటితో సీబీఐ విచారణ జరగాలనే ఫీలింగ్ కలుగుతోందని, “చూస్తుంటే దర్శన్ ఇతరులతో కలిసి సిగరెట్ పట్టుకుని టీ తాగడం చూసి ఆశ్చర్యపోతున్నా.. అని ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో ఉన్నాడా లేదా జైలులో ఉన్నప్పుడు ఇతర సాధారణ ఖైదీల వలె వ్యవహరించాలి, కానీ ఇక్కడ అతను రిసార్ట్‌లో కూర్చున్నట్లు కనిపిస్తోంది” అంటూ విచారం వ్యక్తం చేశాడు.