NationalNews

సుప్రీం కోర్టులో మాల్యాకు చుక్కెదురు, 4 నెలలు జైలు శిక్ష

Share with

9 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మాల్యాకు కోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. 2017లో నమోదైన కోర్టు ధిక్కారం నేరం కేసులో పరారీలో ఉన్న మద్యం వ్యాపారి విజయ మాల్యాకు జైలు శిక్షతోపాటు రూ. 2 వేలు జరిమానా విధించింది. 2017 లో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి… 40 మిలియన్ల అమెరికన్ డాలర్లు అంటే సుమారుగా 317 కోట్ల రూపాయలను తన పిల్లల అకౌంట్లకు బదలాయించిన కేసులో ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరిస్తూ విదేశాల్లో ఉన్న “డియాజియో” కంపెనీ బ్యాంకు అకౌంట్ నుంచి విజయ మాల్యా తన కుమారుడు సిద్ధార్థ మాల్యా, ఇద్దరు కుమార్తెలు లియన్నా మాల్యా, తన్యా మాల్యాల నగదు బదిలీ చేశారు. అప్పటికే ఆస్తులను ఎవరికి ట్రాన్స్‌ఫర్ చేయొద్దంటూ స్పష్టం చేసినా… చేయడంపై కోర్టు మండిపడింది. మాల్యా నిర్ణయంపై స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేతృత్వంలోని పలు బ్యాంకుల కన్సార్టియమ్… కోర్టు ధిక్కారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.