NationalNews

అన్నాడీఎంకే చీఫ్ గా పళని స్వామి

Share with

అన్నాడీఎంకేలో ఆధిపత్య పంచాయితీ సరికొత్త పుంతలు తొక్కుతొంది. కోర్టులో మాజీ సీఎం పన్నీర్ సెల్వమ్ కు చుక్కెదురు కావడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ సీఎం పళని స్వామికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అక్కడ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయ్. మాజీ సీఎం, అన్నాడీఎంకే ముఖ్యనేత పన్నీర్ సెల్వమ్‌, మరో మాజీ సీఎం పళని స్వామి మధ్య కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నాయ్. కోర్టు తీర్పుతో పళని స్వామి అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ద్వంద్వ పార్టీ నాయకత్వం ఇకపై ఏకచ్ఛత్రాధిపత్యంగా మారనుంది. కోర్డినేటర్, జాయింట్ కోర్డినేటర్ వ్యవస్థ ఉండటంతో ఏదైనా నిర్ణయం తీసుకోడానికి ఇబ్బందులు ఎదురయ్యేవి. పన్నీర్ సెల్వం, పళని స్వామి మధ్య ఆధిపత్య పోరుతో పార్టీలో గందరగోళం నెలకొంది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో సమావేశమైన అన్నాడీఎంకే నేతలు పన్నీర్ సెల్వమ్‌పై వేటు వేయాలని నిర్ణయించారు.

ఇవాళ నిర్వహించే సమావేశాన్ని ఆపాలంటూ మద్రాస్ హైకోర్టును పన్నీర్ సెల్వం కోరారు. కానీ కోర్టు అందుకు ససేమిరా అంది. పన్నీర్ సెల్వం విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించడంతో… పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని పార్టీ ముఖ్యలు నిర్ణయించారు. పార్టీ చీఫ్ గా పోటీ చేసే విషయంలోనూ అనేక బై లా లను పార్టీ సవరించింది. అదే సమయంలో ప్రాధమిక సభ్యత్వం ఉన్న 10 ఏళ్లు నిండిన వ్యక్తి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిబంధనపైనా సవరణలు చేసింది. పళని స్వామిని సీఎంగా శశికళ వీలు కలిగించినా.. ఆతర్వాత పరిణామాలతో పళని.. పార్టీపై గ్రిప్ పెంచుకున్నారు. పన్నీర్ సెల్వంపై పై చేయి సాధించారు. నాలుగేళ్లలో పార్టీలో తన మాటకు తిరుగులేని విధంగా వ్యవస్థను నడిపించారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించే విషయంలో పన్నీర్ సెల్వం, పళని స్వామి ఒక్కటయ్యారు. ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కువవడంతో… పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి వెళ్లగొట్టారు పళని స్వామి.