సరైన సమయంలో బీజేపీలోకి వెంకట్‌రెడ్డి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్లో కూర్చునే మనిషి కాదని.. తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన వ్యక్తి అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ ఊపు మీదున్న కాలంలోనూ తాము ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచామని.. ప్రజల్లో పట్టున్న తమను దూరం చేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ బాధ పడుతోందని చెప్పారు. వెంకట్‌రెడ్డి బీజేపీలో చేరే విషయంపై సమయం వచ్చినప్పుడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమలాంటి వారికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగకు ఇవ్వడం వల్లే తాము కాంగ్రెస్ పార్టీకి దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు.

కాలం చెల్లిన కాంగ్రెస్..
తెలంగాణాలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని.. కంచుకోట అయిన మునుగోడులో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కక పోవడమే దీనికి నిదర్శనమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తాము తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని.. ఆత్మగౌరవం ఉండటం వల్లే మునుగోడులో ఓడిపోయినా ప్రజల్లో నిలబడ్డామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనమైందని.. క్యాడర్ అంతా నిరుత్సాహంలో కూరుకుపోయిందని విమర్శించారు.

