NewsNews AlertTelangana

మునుగోడు బరిలో నిలిచే దెవరు..? గెలిచేదెవరు..?

Share with



ఆపరేషన్ మొదలయ్యింది. గెలుపే లక్ష్యంగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలలో తలమునకలవుతున్నాయి. గెలవాలి.. గెలిచి తీరాలి. పట్టు సాధించాలి.. పవర్ లోకి రావాలి. ఇవే వారి ఆలోచనలు. దీంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎలాగైనా తెలంగాణ పీఠాన్ని దక్కించుకోవాలని పావులు కదుపుతున్న కమలనాధులు మునుగోడుపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా తానేంటో నిరూపించుకున్న సునీల్ బన్సాల్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తూ , రంగంలోకి దింపుతోంది. ఆయన స్కెచ్చేస్తే ఫలించినట్టే. వల విసిరితే చేపలు నిండుగా పడ్డట్టే. వ్యూహం రచిస్తే .. విజయం లభించినట్టే. అదే నమ్మకంతో, కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించి బన్సాల్ ను తెలంగాణకు పంపుతోంది. దీంతో పాలిటిక్స్ హీటెక్కాయి. సాధారణ ఎన్నికలకు ముందు జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.


సైరన్ మోగక ముందే సందడి మునుగోడులో సందడి మొదలైంది. బీజేపీలో మినహా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో అభ్యర్ధలు ఎవరన్న దానిపై రచ్చ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న నేతలు ఢిల్లీ స్ధాయిలో పెద్ద ఎత్తున పైరవీలు మొదలు పెట్టారు. అయితే కొద్ది రోజుల క్రితం పార్టీ తీర్ధం తీసుకున్న చెరుకు సుధాకర్ కే సీటు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండడంతో పార్టీలో అలకలు తారాస్ధాయికి చేరాయి. ఎలాగైనా తమ సీటును తాము నిలబెట్టుకోవాలి. మునుగోడులో గెలిచి, మొనగాడుగా నిలవాలి. ఇదే కాంగ్రెస్ ఆలోచన. కానీ.. నేతల తీరు ఆ పార్టీని ఆందోళనలో పడేస్తోంది. కలిసికట్టుగా పని చేస్తే విజయం తధ్యం అని భావిస్తున్నప్పటికీ ఎంత వరకు అది సాధ్యమో ఆ పార్టీ నేతలకే అర్ధం కాని పరిస్ధితి. టికెట్ రేసులో పాల్పాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవి కుమార్, కైలాస్ తదితరులు ఉన్నారు. అయితే ఇప్పుడు చెరకు సుధాకర్ కే కన్ఫామ్ అంటూ జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ లో దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు వీరితో చర్చలు జరుపుతున్నారు. ఎవరికి సీటు కేటాయించినా అంతా కలిసికట్టుగా పని చేయాలని ఆశావహులకు సూచిస్తున్నారు. అయితే అవేమి పట్టించుకోకుండా అభ్యర్ధిత్వాన్ని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. తమకు సీటు ఇస్తే గెలిచే అవకాశాలను అధిష్టానం ముందు ఏకరువు పెడుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన స్రవంతి .. ఈసారి తప్పకుండా తనకే సీటు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ అధిష్టానానికి చమటలు పట్టిస్తున్నాయి. ఎవరికి అభ్యర్ధిత్వం ఇవ్వాలి అన్న దానిపై ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అన్ని విధాలుగా అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, అభ్యర్ధి ఎంపికపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఈనెల 16 నుండి మండలాల వారీగా సమావేశాల నిర్వహణకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.

2019లో జరిగిన ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికే టీఆర్ఎస్ తిరిగి సీటు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే జరిగితే తాము సహకరించేది లేదని నియోజకవర్గానికి చెందిన మునుగోడు, నారాయణపూర్, మర్రిగూడ, చుండూరు, నాంపల్లి, చౌటుప్పల్ కు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు తెగేసి చెబుతున్నారు. దీంతో అసంతృప్తి నేతలందరినీ బుజ్జగించే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేరుగా కలిసి తమ నిర్ణయాన్ని చెప్పాలని అసంతృప్తి నేతలు భావిస్తున్నారు. అయితే అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అని మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. మునుగోడు ఎన్నికల్లో విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న బూరా నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులను బుజ్జగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే .. తమలో ఎలాంటి అసంతృప్తి లేదంటున్నారు. గెలుపు వ్యూహాలకు పదును పెడుతూ , ఈసారి ఆ సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్ తరహాలో విజయం సాధించేందుకు అందరితో సమాలోచనలు జరుపుతోంది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేసి, అక్కడ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన సునీల్ బన్సాల్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించి పంపుతోంది. ఏ పని అప్పగించినా ఏకాగ్రతతో, సత్య నిష్టతో పని చేస్తారని బన్సాల్ కి పేరు. అయితే సాధారణ ఎన్నికలకు ముందే ఆయనను ఇక్కడకు పంపడం వెనుక బీజేపీ పెద్ద ఎత్తున ప్లాన్ చేసిందని భావిస్తున్నారు. ఆయనపై ఉన్న అపార నమ్మకం.. పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు ఆయన రచించే వ్యూహాలన్నీ ఫలిస్తాయన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది. పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం ఖాయమని కమలనాధులు భావిస్తున్నారు. మునుగోడు విజయంతో తెలంగాణలో రానున్నది బీజేపీ సర్కారే అన్న సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ తహతహ లాడుతోంది. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో.. మునుగోడు పీఠంపై ఎవరిని ఓటర్లు నిలబెడతారో.. ఎవరికి పట్టం కట్టి అసెంబ్లీకి పంపిస్తారో వేచి చూడాల్సిందే.