ఉపరాష్ట్రపతి బరిలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి
కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. నఖ్వీకి బీజేపీ హైకమాండ్ తీపి కబురు అందిస్తోన్నట్టు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి రేసులో నఖ్విని నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని… అందుకే ఆయన ఇవాళ కేబినెట్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో… నఖ్వీతోపాటు, ఆర్సీపీ సింగ్ కూడా ఇవాళ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. నఖ్విని ఉపరాష్ట్రపతి బరిలో నిలుపుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అందుకే ఆయనకు యూపీలో జరిగిన ఉపఎన్నికల్లోనూ పార్టీ పోటీలో నిలుపలేదు. ఎన్డీఏ అభ్యర్థిగా నఖ్వీని పార్టీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం నఖ్వి ప్రధాని మోదీని, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిశారు. దీంతో ఆయనను ఉపరాష్ట్రపతి బరిలో నిలపబోతున్నారన్న క్లారిటీ వచ్చేస్తోంది. ఐతే ఉపరాష్ట్రపతి పదవి రేసులో పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్లు సైతం విన్పిస్తున్నాయ్.