ఉపరాష్ట్రపతిగా నఖ్వీ గెలుపు లాంఛనమే
జార్ఖండ్ నుంచి బీజేపీ తరుపున కేంద్ర మైనారిటీ శాఖ మంత్రిగా సేవలందించిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, బీహర్ నుంచి జేడీయూ తరుపున ప్రాతినిధ్యం వహించిన ఆర్పీ సింగ్‌లు బుధవారం పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ప్రధాని మోదీకి అందించారు. దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. వీరి రాజీనామాకు ప్రధాన కారణం రాజ్యసభలో వారి పదవీకాలం ముగియడమే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. అయితే ఆ పరిస్థితి లేకపోవడంతో వారు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నఖ్వీ రాజీనామా అనంతరం బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించే క్రమంలోనే ఈ పరిణామాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపాయ్. ఈ పరిణామం సద్దుమణుగుతున్న తరుణంలో… ప్రపంచవ్యాప్తంగా భారత్ పై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని మోదీ భావిస్తున్నారు. అందులో భాగంగా… దేశంలోనూ అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపేలా… ముస్లిం అయిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నఖ్వీ వాజ్ పేయి మంత్రి వర్గంలో సహయ మంత్రగా పనిచేశారు. ఇప్పటి వరకు రాజ్యసభలో బీజేపీ ఉపనేతగా సేవలందించారు. ఆయన స్వస్థలం ఉత్తర ప్రదేశ్ రామ్ పూర్. మైనారిటీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న లోక్ సభ స్థానం అయినప్పటికీ నఖ్వీకి ఆశించిన విధంగా పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయనను బీజేపీ తరుపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దింపుతారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అయితే ఉపరాష్ట్రపతి పదవి రాజ్యసభలో చాలా కీలకమైన పదవి కాబట్టి బీజేపీ పార్లమెంటరీ బోర్డు దీనిపై బాగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.