NewsNews AlertTelangana

కేసీఆర్‌వి… మాటలే చేతలు కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Share with

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ మాటలే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు, అత్యాచారాలకు, దారుణాలకు ప్రతిరూపమని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగం చేస్తున్న సర్కార్‌ ఏదైనా ఉందంటే.. అది తెలంగాణ సర్కారేనని విమర్శించారు. దేశాన్ని ఉద్ధరించడాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ప్రజల సమస్యలపై స్పందించాలని కేసీఆర్‌కు హితవు పలికారు కిషన్ రెడ్డి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ఈ రోజు యాదాద్రి భువనగరి జిల్లాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయన్నారు. అధికారులు కూడా చట్టపరంగా, న్యాయపరంగా వ్యవహరించాలన్నారు. అధికారులు అతిగా వ్యవహరించవద్దని కూడా సుతిమెత్తగా హెచ్చరించారు. తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన తప్ప కేసీఆర్ కు ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. కేసీఆర్ వచ్చే జన్మలో కేంద్ర రాజకీయాల గురించి ఆలోచించంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు…..రాష్ట్రంలో సీటు ఖాళీ అయ్యేట్టు ఉంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నెలలో 20 రోజులు ఫార్మ్ హౌస్ లోనే ఉంటారన్నారు. ప్రగతి భవన్ లో 10 రోజులు ఉంటే 8 రోజులు మోదీనే తిడతారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌కు కేంద్రం పై కుట్రలు చేయడానికి టైం ఉంటుంది, కానీ.. ప్రజలను కలవడానికి సమయం ఉండదని పేర్కొన్నారు. ఇక్కడ రైతులు నష్టపోతుంటే.. పంజాబ్ రాష్ట్రానికి వెళ్లి డబ్బులు ఇస్తారా అంటూ విమర్శించారు. రైతుల దగ్గరి నుంచి వడ్లు కొంటున్నామంటూ ఊదరగొట్టి.. ఇప్పుడు మాట మార్చారన్నారు. 1300 ఎంఎస్ పీ ఉంటే.. ఏడు సంవత్సరాల్లో రూ. 2,060 చేశామన్నారు. దీంతో రైతులకు మేలు జరగలేదా అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు హామీలిచ్చి.. ఆ తర్వాత మర్చిపోతారని ఎద్దేవా చేశారు.అబద్దానికి పెద్ద బిడ్డ టీఆర్ఎస్ అంటూ ఎద్దేవా చేశారు. భారీ వర్షాలు వచ్చినా కేసీఆర్‌కి పట్టింపులు లేవని మండిపడ్డారు కిషన్‌ రెడ్డి.