ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడి
ప్రజలతో కలిసి భోజనం చేసే కార్యక్రమానికి తాను భార్యతో కలిసి వచ్చానని ఈటల చెప్పారు. మహిళలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో టీఆర్‌ఎస్ వాళ్లకు కడుపు మండిందని.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు టీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి రాళ్ల దాడికి దిగారని ఆరోపించారు. జెండాల ముసుగులో రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారన్నారు. ఎదురు దాడి చేయడం తమకు చేతకాక కాదని.. సంయమనం పాటించడం వల్ల ఘర్షణ పెరగలేదన్నారు. దాడులకు పాల్పడటం, కొట్లాటకు దిగడం, భౌతిక దాడులకు తాము విరుద్ధమని పేర్కొన్నారు. తాము గెలుస్తామనే ధీమాతో సహనం పాటిస్తున్నామని.. ఓటమి భయంతో అసహనానికి గురైన వాళ్లే దాడి చేశారని చెప్పారు.

తన గన్‌మెన్లు, పీఏ గాయపడ్డారని.. 10-15 కార్లు ధ్వంసమయ్యాయని ఈటల రాజేందర్ వివరించారు. ఇలాంటి చిల్లర వేషాలు గతంలో చాలా చూశామని.. టీఆర్‌ఎస్ వాళ్ల అరాచకాలను మునుగోడు ప్రజలు చూస్తున్నారని చెప్పారు. మునుగోడు ప్రజలు సరైన తీర్పు ఇస్తారని.. రానున్న కాలంలో ఏం చేయాలో అది చేస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే దాడులు చేస్తోందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. మునుగోడులో టీఆర్‌ఎస్ ఓడిపోతోందని.. అందుకే సౌమ్యుడైన ఈటలపై దాడి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.


 
							 
							