బీజేపీ వల్లే ఏపీలో ఉచిత బియ్యం
ఉచిత బియ్యం ఉద్యమం ఫలించిందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమంతో ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. ఏప్రిల్ మాసం నుండి వైసీపీ ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వడం మానుకుందని… బీజేపీ ఆందోళనలతో దిగొచ్చిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి క్షేత్ర స్ధాయిలో ఉద్యమాలు చేయడం వల్ల పేదలకు మేలు జరుగుతోందన్నారు. ఎంపీ జీవిఎల్ కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు ఫిర్యాదు చేయడం ఆయన రియాక్ట్ కావడంతోనే ప్రజలకు ఉచితంగా బియ్యం అందుతున్నాయన్నారు. కేంద్రం ఒత్తిడి చేయడం వల్లే ఉచిత బియ్యం పంపిణీకి జగన్ ప్రభుత్వం సిద్ధమయ్యిందన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ఏవిధంగా దిగివచ్చేలా చేయాలో బీజేపీకి బాగా తెలుసునన్నారు.
బీజేపీ ఉద్యమం ద్వారా మాత్రమే ఈ రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు సోము వీర్రాజు. 4 నెలల ఉచిత బియ్యం ఒకేసారి ఇవ్వాలని సోము డిమాండ్ చేశారు. రేషన్ నిమిత్తం అయిదు మాసాలకు రెండువేల అయిదువందల కోట్లు రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. వాస్తవాలను దాచిపెట్టి రేషన్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ పోరాటం సాగిస్తుందన్నారు. ఆగస్టు 1 నుంచి గతంలో మాదిరిగా రేషన్ కార్డుదారులందరికీ ఉచిత రేషన్ బియ్యం విడుదల చేయాలన్నారు. నిబంధనల పేరుతో కేవలం 88 లక్షల మంది కార్డుదారులకే కాకుండా… మిగిలిన 56 లక్షల కార్డుదారులకు ఇవ్వాల్సిందేనన్నారు సోమువీర్రాజు.