ఆ 8 గుర్తులతో ‘కారు’కు ఇబ్బంది.. తొలగించండి..
మునుగోడులో టీఆర్‌ఎస్‌కు గుర్తుల సమస్య తలెత్తింది. ఈవీఎం మిషన్‌లో కారును తలపించే గుర్తులు ఉండటం టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు, నిరక్షరాస్యులు, వృద్ధులు.. కారు అనుకొని మరో గుర్తుపై ఓటేస్తే తమకు రావాల్సిన ఓట్లు తగ్గిపోతాయని, తక్కువ మెజారిటీతో ఫలితం తేలే పరిస్థితిలో అది తమకు నష్టదాయకమవుతుందని టీఆర్‌ఎస్ నాయకులు భయపడుతున్నారు. అందుకే గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతి రోలర్, డాలీ, రోడ్డు రోలర్, సబ్బు డబ్బా, ఓడ, టీవీ, కుట్టు మిషన్‌ను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇవన్నీ కారు గుర్తును పోలి ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురవుతారని చెప్పారు. 48 గంటల్లో ఈసీ స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

2018 ఎన్నికల్లో నష్టపోయాం..
2018 ఎన్నికల్లో మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో రోడ్డు రోలర్ గుర్తుతో నష్టపోయామని టీఆర్‌ఎస్ నాయకులు గుర్తు చేశారు. అప్పుడు రోడ్డు రోలర్ గుర్తు కారును పోలి ఉండటంతో టీఆర్‌ఎస్‌కు వేయాలనుకున్న ఓటర్లు కారు గుర్తు అనుకొని పొరపాటున రోడ్డు రోలర్‌కు వేశారని వాపోయారు. సీపీఎం, బీఎస్పీ కన్నా రోడ్డు రోలర్ గుర్తు కలిగిన అభ్యర్థికే ఎక్కువ ఓట్లు రావడం దీనికి నిదర్శనమన్నారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జున సాగర్ నియోజక వర్గాల్లో కెమెరా గుర్తు అభ్యర్థికి బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.

