NewsTelangana

ఈ రోజు మా జన్మ ధన్యమైంది

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సికింద్రాబాద్‌లోని సాంబమూర్తి నగర్‌లో బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. .. అమిత్‌షాకు స్థానిక కార్పొరేటర్‌ స్వాగతం పలికారు. కేంద్ర హోం మంత్రిని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. సత్యనారయణ బాగోగులు అడిగి తెలుసుకున్న తర్వాత వారింట్లోనే కాఫీ తాగారు అమిత్‌ షా. కేంద్ర హోం మంత్రిని కలిసేందుకు స్థానికులు పోటీ పడ్డారు.

అనంతరం బీజేపీ కార్యకర్త సత్యనారాయణ మీడియాతో ముచ్చటించారు.. “ఈ రోజు మా జన్మ ధన్యమైంది. భారత దేశానికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి… చిన్నపాటి బస్తీలో ఉన్న మా ఇంటికి రావడం నిజంగా గొప్ప అదృష్టం. మేం దీన్ని జీవితాంతం మర్చిపోలేం. నిన్నటి నుంచి మా కాలనీలో పండుగ వాతావరణం ఉంది. అమిత్‌ షా కోసం వేయికళ్లతో ఎదురు చూశాం. ఆయన మా ఇంటికి రాగానే ఆనందాన్ని ఆపుకోలేకపోయాం“ అని చెప్పారు.  ఈ క్రమంలో సత్యనారాయణ, ఆయన కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారు.

అమిత్‌ రాకపై సాంబమూర్తి నగర్‌ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి సామాన్య బీజేపీ కార్యకర్త ఇంటికి వస్తారని తాము ఊహించలేదని బస్తీవాసులు చెప్పుకొచ్చారు. బీజేపీలో చిన్నపాటి కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని వెల్లడించారు.  దళిత వాడకు వచ్చి అమిత్‌ షా కాఫీ తాగడం… బలహీన వర్గాలపై బీజేపీ దృక్పథాన్ని చాటి చెబుతోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.