ఇవాళ ఆరా సంస్థ 16వ ఫౌండేషన్ డే
ఆ పేరులోనే ఓ స్వచ్ఛత. ఆ పేరులోనే ఓ కచ్చితత్వం. ఆ పేరులోనే ఒక విశ్వాసం. ఒక నమ్మకం, ఒక దీమా. ఆ పేరులోనే భారతీయత పెనవేసుకొంది ‘ఆరా’ సంస్థ. 15 ఏళ్ల క్రితం… అనగా, 08.08.2008న ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సర్వే రంగంలో ఒక విశ్వసనీయ భాగస్వామిగా అటు రాజకీయనాయకులకు, ఇటు ప్రజలకు విశేష సేవలందిస్తోంది. ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రాజకీయ నాయకులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారన్నదానిపై ముందుగానే ఒక అంచనా వేసి అటు సమాజానికి ఇటు సదరు రాజకీయనాయకుడికి భవిష్యత్ ముఖ చిత్రాన్ని అందిస్తోంది. ఒక వ్యక్తితో ఏర్పడిన ‘ఆరా’ వటుడింతై అన్నట్టుగా… ఇవాళ దేశ రాజకీయ పోకడలను, తెలుగు రాజకీయాల స్థితిగతులను అంచనా వేయడంలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో ముందడుగేస్తోంది.

అంచలంచెలుగా ఎదిగి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు, మార్గదర్శనం చేయడంతోపాటు, నిత్యం ప్రజలకు ఉపయోగపడే… ప్రజల సంక్షేమానికి ఒక భాగస్వామిగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో, ‘ఆరా’ గత పదిహేనుళ్లుగా ముందడుగేస్తోంది. ‘ఆరా’ సూచించిన అనేక కార్యక్రమాలు ఈరోజు దేశంలో అనేక మంది జీవితాలను మార్చుతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న నాడు-నేడు పథకం, వైఎస్సార్ జనతా బజార్, తెలంగాణలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 30 శాతం అధిక వేతనం లాంటి అనేక కార్యక్రమాల రూపకల్పనలో ‘ఆరా’ ప్రభుత్వాలకు ఎన్నో సూచనలు చేసింది. ‘ఆరా’ రీసెర్చ్ ద్వారా ఆ పథకాల అవసరం తెలుసుకోగలిగామని చెప్పడానికి గర్విస్తున్నాం.

దేశ వ్యాప్తంగా ‘ఆరా’ సర్వే ద్వారా అనేక మందిని రాజకీయాలకు పరిచయం చేసి వారిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్ది, ప్రజల కష్టనష్టాల్లో పాలుపంచుకునేలా చేసింది. ప్రజల సమస్యలను పరిష్కరించి, వారితో మమేకమవడం… ద్వారానే రాజకీయాల్లో మనుగడ సాధ్యమని తేల్చి చెప్పాం. ప్రజల మనసులను గెలుచుకోవడం ద్వారానే రాజకీయాలు సాధ్యమని నమ్మిన ‘ఆరా’, ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాల రూపకల్పనలో విశేష కృషి చేసింది. అంతే కాదు ‘ఆరా’ సర్వేలో పనిచేసిన వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాదు… వారు ఉన్నత చదువులు చదవడానికి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి సోపానమయ్యింది. రాబోయే రోజుల్లో ఉపాధి కల్పన ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాలని, అంతిమంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా వ్యవహరిస్తోంది.

