అమెరికాలో మైనర్లకు టిక్‌టాక్‌పై టైమ్ లిమిట్
అమెరికాలో టిక్‌టాక్ యాప్ వినియోగించే మైనర్లకు దానిపై 1గంట సమయ పరిమితిని త్వరలో విధించనున్నట్లు టిక్‌టాక్ తాజాగా ప్రకటించింది. ఈ యాప్‌పై వివిధ కారణాలతో అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కాగా వీటిని అదుపు చేసే క్రమంలో ఈ కొత్త పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ యాప్‌పై వినియోగించే సమయాన్ని తగ్గించడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ సంస్థ విశ్వాసం, భద్రత విభాగం అధిపతి కార్మాక్ కీనన్ నిన్న ఓ కీలక ప్రకటన చేశారు. దీని ప్రకారం యాప్‌ను వినియోగించే సమయంలో 60 నిమిషాల పూర్తి కాగానే..పాస్‌కోడ్‌ను నమోదు చేసి క్రియాశీలక నిర్ణయం తీసుకోవాలని మైనర్లకు సూచన వస్తుంది. ఆ సమయంలో 13 ఏళ్ల లోపు వినియోగదారులకు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అప్పటికే రూపొందించుకున్న పాస్‌కోడ్‌ను నమోదు చేస్తే మరో 30 నిమిషాల అదనపు సమయం లభిస్తుందని తెలిపారు. బోస్టన్ చిల్డ్రన్స్ హస్పటల్ డిజిటల్ వెల్‌నెస్ ల్యాబ్ నిపుణులు,పులువురు అధ్యాపక పరిశోధకులను సంప్రదించి యాప్ వీక్షణ సమయాన్ని 60 నిమిషాలకు కుదించినట్లు టిక్‌టాక్ వెల్లడించింది.

