ప్రజల కోసమే ఈ పాలన… నాన్న జీవితమే స్ఫూర్తి
ఇచ్చిన మాట, నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి శ్వాస వరకు కట్టుబడి జీవించిన వైఎస్సార్ జీవితమే స్ఫూర్తి అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన ఆలోచనలు ప్రభుత్వానికి మార్గదర్శకమని అన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. నాన్న ఇచ్చిన ఈ జగమంత కుటుంబం అండగా నిలిచిందన్నారు. ప్రతి పక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడని టీడీపీపై సెటైర్ వేశాడు సీఎం జగన్. తాను పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని కుట్రలు చేసినా గుండె చెదరలేదన్నారు. ఎన్ని రాళ్లు వేసినా.. ఎన్ని నిందలు వేసినా భరించానని జగన్ చెప్పుకొచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీలో సీఎం జగన్ జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. మొదట సీఎం జగన్, విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ…. నాన్నా… మిమ్మల్ని ఆరాధించే కోట్ల మంది చిరునవ్వుల్లో నిత్యం మీ రూపమే కనిపిస్తోందన్నారు.
ఓదార్పు యాత్రతో వైసీపీ పార్టీ ఏపీలో బలంగా తయారైందన్నారు. మన మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి 95 శాతం హామీలు అమలు చేశాం. పదవి అంటే అధికారం కాదు. ప్రజల మీద మమకారం అని నిరూపించామన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం తపనపడ్డామన్నారు జగన్. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్న జగన్… 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కట్టుకథల్ని, వాటికి అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా ప్రచారం చేయడం తప్పించి… బాబు చేసిందేముందన్నారు. గతంలో రాష్ట్రాన్ని దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా పనిచేసిందని… ఇప్పుడు అవకాశం దొరక్క కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో నిలుస్తోందన్నారు.