Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

రేషన్ కార్డులకు ఇదే ప్రమాణం… ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డు లబ్దిదారులకు నంబర్‌తో పాటు వారి కుటుంబ వివరాలు జాబితాలో నమోదు చేస్తున్నామని, వీరందరికీ వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. ప్రింటింగ్ దశలో ఉన్న కార్డులు త్వరలో ఫిజికల్ రూపంలో అందించబోతున్నామని, ఇప్పటికే రేషన్ కార్డు మోడల్‌ను తుది రూపం ఇచ్చామని తెలిపారు.

దారిద్య్ర రేఖ ఆధారంగా రేషన్ కార్డులను రంగులతో వేరు చేయనున్నట్లు వెల్లడించారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి మూడు రంగులతో కూడిన కార్డు, దాని పైన ఉన్నవారికి గ్రీన్ కార్డు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇది రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచే దిశగా ముందడుగేనని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలను మంత్రి ఉత్తమ్ ప్రశంసించారు. “గత పదేళ్లలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఉప ఎన్నిక వచ్చిన చోట్ల మాత్రమే అందజేశారు,” అని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతోందని వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా, అదనంగా 95 లక్షల కార్డులు మంజూరవుతుండటంతో మొత్తం లబ్దిదారుల సంఖ్య 3 కోట్ల 10 లక్షల మార్కు దాటబోతోందన్నారు. ఏడాదికి రూ.13 వేల కోట్ల వ్యయంతో నాణ్యమైన సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద రేషన్ సంక్షేమ పథకంగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన బియ్యం ప్రజలు వినియోగించలేని స్థాయిలో ఉందని, కొత్తగా అందించనున్న బియ్యం నాణ్యత పరంగా చాలా మెరుగైందని చెప్పారు.