Andhra PradeshNews

ఇదే నా చివరి ఎన్నిక ..గెలిపించి అసెంబ్లీకి పంపించండి : చంద్రబాబు

ఏపీలో రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే సరేనని లేదంటే ఇదే తనకు చివరి ఎన్నికలు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. తనకు వయసు అయిపోతుందని అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని తనను తన భార్యను తీవ్రంగా అవమానించారని అధికారంలోకి వస్తే కౌరవసభను గౌరవ సభగా మారుస్తానని ప్రజలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించి ఆత్మాభిమానాన్ని గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండలలో బుధవారం రాత్రి రోడ్డుకు షోకు హాజరైన చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైసీపీ నాయకులు పదేపదే తనకు వయసు పైబడిందని అంటున్నారని తాను చాలా ఆరోగ్యంగా ఫిట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు.

అంతకుముందు మూడు రోజుల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ఆయన కర్నూలుకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిల సమక్షంలో పార్టీ శ్రేణులు విద్యార్థులు వివిధ వర్గాల ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా అని ప్రశ్నించారు. సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని, నాడు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైటెక్ సిటీ కూల్చివేసి ఉంటే తర్వాత అభివృద్ధి జరిగేదా అని అన్నారు. కర్నూలు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిలిపివేశారని విమర్శించారు. కాగా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వాలని కర్నూలు రాజధానిగా చేసేందుకు మద్దతు ఇవ్వాలని ఈ సభలో ఆందోళనకారులు డిమాండ్ చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు.