Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

అక్రమ కేసులకు బెదిరేదేలేదు..

నెల్లూరు :అక్రమ కేసులకు బెదిరేదే లేదని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిపై భూముల కబ్జా ఆరోపణలు చేస్తూ, ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాకాణి గోవర్థన్‌రెడ్డి నెల్లూరులో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, అక్రమ కేసులకు తాను బెదిరేదే లేదని స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అక్రమాలపై తాను ధర్మ పోరాటం చేశానని పేర్కొన్నారు. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని ఎమ్మెల్యేను ప్రశ్నించడం నేరమా అని నిలదీస్తూ, ప్రశ్నిస్తే కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు వస్తుందని విమర్శిస్తూ, వైసీపీ ప్రభుత్వంలో దేవుడి భూములకు కాపలా కాశామని, అయితే ప్రస్తుతం టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జా చేస్తున్నారని, దేవుడి ధర్మాన్ని పక్కనపెట్టి దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్నారని ఆరోపించారు. సోమిరెడ్డిలాంటి దొంగల మీద కాకుండా తన మీద కేసులు పెట్టడం ఏంటి అని కాకాణి మండిపడ్డారు. ఈ సందర్భంగా, సోమిరెడ్డికి ఆయన ఒక సవాల్ విసిరారు. “సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలిసిస్ టెస్ట్‌కి సిద్ధమా? నువ్వు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూమిని అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్ట్‌కు సిద్ధం,” అని ప్రకటించారు. కాకుటూరు శివాలయం భూములను సోమిరెడ్డి కబ్జా చేశారని, 1980లో హరిప్రసాద్‌రెడ్డి అనే దాత శివాలయానికి భూములిచ్చారని, ఇది ప్రభుత్వ రికార్డ్‌ల్లోనూ దేవాదాయ భూమిగానే ఉందని కాకాణి ఆరోపించారు. సర్వే నెంబర్‌ 63-ఏ1లోని 0.48 సెంట్ల భూమిని ఆక్రమించి, రూ.కోటి తీసుకుని ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారని మాజీ మంత్రి స్పష్టం చేశారు.