‘దేశం వైపు కన్నెత్తి చూస్తే మీకు నూకలు చెల్లినట్లే’..రేవంత్ రెడ్డి
ఆపరేషన్ సింధూర్ వెనుక 140 కోట్ల మంది భారతీయులున్నారని, ఉగ్రవాదుల పీచమణిచే వరకూ ఇది కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదన్నారు. ‘దేశం వైపు కన్నెత్తి చూస్తే మీకు నూకలు చెల్లినట్లే’ అంటూ మండిపడ్డారు. ఇలాంటి సందర్భాలలో రాజకీయాలకు తావు లేకుండా పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా దేశప్రజలంతా ఏకమవుతామని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగిన సంఘీభావ ర్యాలీలో జాతీయజెండాతో ఆయన పాల్గొన్నారు. పోలీసులు, వేలమంది ప్రజలు, మాజీ సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు సచివాలయం నుండి నెక్లెస్ రోడ్ రోటరీ వరకూ ఈ సంఘీ భావ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి చిత్రపటాలకు నివాళులర్పించి, మౌనం పాటించారు.

