అమెరికా మహిళా క్రికెట్ టీమ్‌లో మొత్తం భారతీయ మూలాలున్న అమ్మాయిలే…
మీరు చదువుతున్నది వందకు వంద శాతం నిజం. అమెరికాలో భారతీయులు అనేక రంగాల్లో దూసుకుపోవడం గురించి దశాబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం. ప్రస్తుతం అమెరికాలో ఎన్నో కీలక పదవుల్లో భారతీయ సంతతి వ్యక్తులు చరిత్ర సృష్టిస్తున్నారు. వందల సంఖ్యలో భారతీయులు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో ముఖ్య పదవులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా అమెరికా అండర్ 19 ప్రపంచ కప్ పోటీలకు జట్టును ప్రకటించింది. అమెరికా క్రికెట్ ఆడటమేంటి? జట్టును ప్రకటించడమేంటనేగా మీ డౌట్.. కానీ ఇది నిజం.. అమెరికా ఎంపిక చేసిన 15 మంది క్రీడాకారులు మొత్తం భారతీయ మూలాలు ఉన్నవారే. ఇంటిపేరును బట్టి అమెరికా జట్టుకు కెప్టెన్‌గా తెలుగు వ్యక్తే ఉండబోతున్నారు. అమెరికా 19 క్రికెట్ జట్టుకు గీతిక కొడాలి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నన్నారు. లాస్య ముళ్లపూడి, భూమిక భద్రిరాజు వంటి వారు కూడా ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న వెస్టిండియన్ దిగ్గజ క్రీడాకారుడు శివనారాయణ్ చంద్రపాల్ సైతం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తే కావడం విశేషం.

గత నెలలో ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన చంద్రపాల్ అమెరికా జట్టుకు కోచ్‌గా ఉంటారు. 15 మంది ఆటగాళ్ల జట్టును ప్రకటించిన తర్వాత దక్షిణాఫ్రికాలో వచ్చే నెలలో జరగనునన టోర్నమెంట్‌కు USA మహిళల అండర్ 19 కోచ్‌గా వ్యవహరిస్తాడు. జనవరి 14న ప్రారంభమయ్యే 15 రోజుల టోర్నమెంట్‌లో స్టార్ ఆల్-రౌండర్ గీతిక కొడాలి అమెరికా జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ ఈవెంట్‌కు వికెట్ కీపర్/బ్యాట్స్‌మెన్‌గా అనికా కోలన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇటీవలి UAE పర్యటనలో ఉపయోగించిన 15 మంది ఆటగాళ్లలో పద్నాలుగు మందిని అమెరికా జట్టులో కొనసాగించారు. మరో ఐదుగురు రిజర్వ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

16 ఏళ్ల బ్యాటర్ తరనమ్ చోప్రాను కూడా జట్టులోకి తీసుకున్నారు. అమెరికా మహిళల క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శన ఇస్తోందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కోచ్ చంద్రపాల్. వెస్టిండీస్ U19 మహిళలపై సిరీస్ విజయం తర్వాత, జట్టు దక్షిణాఫ్రికాలో సత్తా చాటుతుందని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అద్భుతమైన దుబాయ్ పర్యటన తర్వాత, ఆటగాళ్ల కోసం, అమెరికా కోసం ఈ చారిత్రాత్మక ప్రపంచ కప్ కోసం తుది సన్నాహకాలపై దృష్టి పెట్టామన్నారు చంద్రపాల్. ఏడాది పొడవునా మేం ఎలాంటి క్రికెట్ ఆడగలమో చూపించాం. ప్రపంచ కప్‌లు చాలా ప్రత్యేకమైనవి, అద్భుతమైన వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి గర్వపడుతున్నామన్నారు. జనవరి 14న బెనోనిలోని విల్లోమూర్ పార్క్‌లో శ్రీలంకతో జరిగే మొదటి మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా ఈవెంట్‌కు USA కఠినమైన పరీక్ష ఎదుర్కొనుంది. జనవరి 16న ఆస్ట్రేలియాతో, రెండు రోజుల తర్వాత బంగ్లాదేశ్‌తో అదే వేదికపై ఢీకొడుతుంది. శక్తివంతమైన ఆస్ట్రేలియన్ జట్టును ఎదుర్కోవడం జట్టుకు కష్టమైన పని అని చంద్రపాల్ చెప్పారు.

అమెరికా U19 జట్టు : గీతిక కొడాలి (c), అనికా కొలన్ (wk) (vc), అదితి చూడాసమా, భూమిక భద్రిరాజు, దిశా ధింగ్రా, ఇసాని వాఘేలా, జీవన అరస్, లాస్య ముళ్లపూడి, పూజ గణేష్ (wk), పూజా షా, రీతు సింగ్, సాయి తన్మయి ఈయున్ని, స్నిగ్ధా పాల్, సుహాని తడాని, తరణం చోప్రా. రిజర్వ్ ఆటగాళ్లు: చేతనా ప్రసాద్, కస్తూరి వేదాంతం, లీసా రామ్‌జిత్, మిటాలి పట్వర్ధన్, త్యా గొన్సాల్వేస్.

