ఐటీఐఆర్ రద్దుతో..కేంద్రంపై విరుచుకుపడ్డ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంపై పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కక్ష ఉందని మంత్రికేటీఆర్ మాటల్లో మనకు స్పష్టంగా అర్దమవుతుంది. దీనికి తగ్గట్టుగానే కేంద్రం కూడా వ్యవహరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవల హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని పార్లమెంటులో ప్రకటించడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇలాంటి ప్రకటనలు చేయడం సిగ్గుచేటని, సంకుచిత రాజకీయాల కోసమే ఐటీఆర్‌ను రద్దు చేశారన్నారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంటులో సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పి కేంద్రం దేశ ప్రజలను మోసం చేస్తోందన్నారు.
బీజేపీ పార్టీ డీఎన్ఏలోనే అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలు నిండి ఉన్నాయి కాబట్టి ఎప్పటిలాగే కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారన్నారు. తాను ఐటీఐఆర్ ప్రాజెక్టుకు బదులుగా హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కేంద్రానికి కనీసం 50 సార్లు విన్నవించానని తెలిపారు. అయినప్పటికి మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకో సిస్టమ్‌కు ఒక్కపైసా కూడా సాయం చేయలేదన్నారు. ఐటీఐఆర్ రద్దుతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణాకు జరిగిన నష్టంపై కేంద్రం వివరణ ఇవ్వాలని కోరారు. కేంద్రం ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎప్పుడో ఆమోదించి ఉంటే.. ఈ ఏడు సంవత్సరాలలో హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టమ్ ఆకాశమే హద్దుగా అభివృద్ది చెంది ఉండేదని కేటీఆర్ అభిప్రాయ పడ్డారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 450 కోట్లతో ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యూబేటర్ టి హబ్-2 ను పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి నయా పైసా సాయం అందలేదని ఆయన మండిపడ్డారు. అయితే కేంద్రం తాజాగా ప్రకటించిన 22 సాఫ్ట్వేర్ పార్కుల్లో తెలంగాణాకు 1 కూడా కేటాయించక పోవడం బీజేపీ కుట్ర పూరిత తనాన్ని తెలియజేస్తోందన్నారు.ఈ విధంగా కేంద్రం తెలంగాణ ఐటీ రంగానికి, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను తెలంగాణ యువత ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుందని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు.