భార్య ప్రాణం తీసిన భర్త మూఢనమ్మకం
భర్త మూఢనమ్మకం ఒక భార్య ప్రాణాలు బలిగొంది. ఇంటి నిర్మాణ సమయంలో భార్య కడుపుతో ఉండటం శుభసూచకం కాదని నమ్మిన ఓ భర్త.. గర్భిణి అయిన తన భార్యకు అబార్షన్ మాత్రలు ఇచ్చి ఆమె మరణానికి కారణమయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంధ గారుగూడకు చెందిన ప్రవళికకు మూడేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. ఇటీవల వారు నూతన ఇంటి నిర్మాణం చేపట్టినట్టారు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. అయితే ఈసమయంలో ఆమె గర్భం దాల్చడం అరిష్టమని భావించిన భర్త ప్రవళికకు అబార్షన్ మాత్రలు మింగించాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం కుటుంబికులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చేర్పించారు. ఆమె పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ పోలీసులు తెలిపారు.

