బీజేపీలో చేరికల జోరు.. 21న సభ
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణాలో బీజేపీ జోరు పెంచింది. ఈ నెల 21వ తేదీన మునుగోడులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బలాన్ని చాటాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులను బీజేపీలో చేర్చుకునేందుకు రాష్ట్ర నాయకులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూనే పార్టీలో చేరికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నేత, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, హుస్నాబాద్ నేత బొమ్మ శ్రీరాంల భేటీని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌తో గరికపాటి మోహనరావు ఏర్పాటు చేశారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు నెల రోజుల క్రితమే బండి సంజయ్‌ను కలిశారు.
పాదయాత్రలో ఉన్న సంజయ్‌ను బొమ్మ శ్రీరాం రెండు రోజుల క్రితం కలిశారు. నర్సాపూర్ మునిసిపల్ చైర్మన్ మురళీగౌడ్ కూడా శనివారం బండి సంజయ్‌ను కలిసే అవకాశం ఉంది. వీరంతా 21న అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.