Andhra Pradeshhome page sliderHome Page SliderNewsTelanganaTrending Todayviral

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తీరం వెంట 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడిన తీవ్ర అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో గురువారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా జిల్లాల్లో పాఠశాలలు నిర్వహించాలా? లేదా? అనేది ఆయా జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇటు హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. కాలుతీసి బయటపెట్టలేని విధంగా వానలు పడుతున్నాయి. మెదక్‌, కామారెడ్డి జిల్లాలో ఏకంగా అధికారులు రెడ్‌ అలెర్ట్ జారీ చేశారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో సర్కార్ గురువారం (ఆగస్ట్‌ 28) పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.