అధికారం మాదే … సీఎం కేసీఆరే
మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, బీఆర్‌ఎస్ పాలన మళ్ళీ రావడం ఖాయమని ఆ పార్టీ నేత హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తన నివాసంలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత పాలనలో బీఆర్‌ఎస్ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లను రాసి పెట్టుకోవాలని, తాము అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడానికి వెనకాడుతోందని ఎద్దేవా చేశారు. బతుకమ్మ పండుగకు సగం మందికైనా చీరలు పంపిణీ చేయలేకపోయిన ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, త్వరలోనే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హరీష్‌రావు స్పష్టం చేశారు.

