గన్నవరం నియోజకవర్గంలో చల్లారని రాజకీయ మంటలు
• అడుగడుగునా పోలీస్ పహారా..అమల్లో కఠిన ఆంక్షలు
• పట్టాభికి 14 రోజుల రిమాండ్, వైద్య పరీక్షలు
• విజయవాడలో పట్టాభి భార్య గృహనిర్బంధం
గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ మంటలు ఇంకా చల్లారలేదు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజుకున్న వివాదం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం ఆ పార్టీ నేతలకు చెందిన కారులు దగ్ధం పరస్పర దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం గన్నవరం నియోజకవర్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకొంది. దీంతో అడుగడుగునా పోలీస్ పహారా కొనసాగుతుంది. నియోజకవర్గం మొత్తాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. గన్నవరానికి బయట వాళ్ళు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులే కాకుండా జిల్లా యంత్రాంగంతో పాటు అదనపు బలగాలు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చారు 144 సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ విధించారు.దీంతో ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు సమావేశాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఇక కొన్ని గంటల హైడ్రామాతో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరికొందరు పార్టీ నేతలు కార్యకర్తలను గన్నవరం పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో గన్నవరం సిఐ కనకారావు గాయపడ్డారు. సిఐని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆయన ఫిర్యాదు పై హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద గన్నవరం పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి తో పాటు 11 మంది నేతలను సోమవారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రంతా కస్టడీలో ఉంచుకున్నట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపించాయి. మరోవైపు పట్టాభి అదృశ్యంపై ఉత్కంఠ వాతావరణం కొనసాగింది. ఆయన భార్య కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సమయంలో పట్టాభిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. పట్టాభి అరెస్టును ధ్రువీకరిస్తూ పోలీసులు ఉదయం 10:30 గంటల సమయంలో ఆయన భార్య చందనకు వాట్సాప్ ద్వారా సమాచారం పంపినట్లు తెలిపారు. కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచి అరెస్టుకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేసిన మీదట పోలీస్ స్టేషన్ లోనే డాక్టర్లను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బందోబస్తు నడుమ పట్టాభితోపాటు అరెస్ట్ అయిన నేతలను కార్యకర్తలను గన్నవరం కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టులోకి వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న పార్టీ శ్రేణులకు పోలీసులు తమను కొట్టారనే సంకేతాలిస్తూ పట్టాభి తన అరచేతులు చూపించారు.

ఇదిలా ఉండగా గన్నవరంలో పట్టాభి అరెస్టు సందర్భంగా విజయవాడలోని ఆయన ఇంటి వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. తన భర్తను కలిసేందుకు బయలుదేరిన పట్టాభి భార్య చందనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. దీంతో భార్య చందన పోలీసులు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను కలవడానికి పోనీవ్వకపోతే ఇంటి పైనుంచి దూకుతానంటూ ఆమె హెచ్చరించారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టాభి నివాసానికి వెళ్లి ఆయన భార్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. పట్టాభి అరెస్టు రిమాండ్‌పై స్పందించిన ఆయన ధైర్యంగా ఉండాలని భార్య చందనకు సూచించారు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


