ద్రౌపది ముర్ముకు ఏపీలో ఘన స్వాగతం
భారతదేశ రాజ్యాంగ చరిత్రలోనే తొలిసారిగా ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అభ్యర్దిగా ఎంపిక కావడం ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీఏ సర్కారు ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం దేశానికే గర్వకారణం. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కూడగట్టడానికి… ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీకి విచ్చారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముకు ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షుడు సోము వీర్రాజు ,ఎంపీలు సీఎం రమేష్, జీ.వీ.ఎల్ స్వాగతం పలికారు. ఆ తరువాత ఆమె నేరుగా నోవోటల్ హోటల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు వెళ్లారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రపతి అభ్యర్దికి తేనీటి విందు ఇచ్చారు. అనంతరం వైసీపీ నేతలతో సీకే కన్వెన్షన్ సెంటర్‌లో భేటీ అయ్యారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేజీపై సీఎం వైఎస్ జగన్.. ద్రౌపది ముర్ముకు పుష్ఫగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం సంతోషకరమన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి ట్రైబల్ మహిళకు అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ముర్ముకు అందరూ మద్దతు పలకాలన్నారు.
ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసి… తేనీటి విందులో పాల్గొన్నారు. శ్రీమతి ద్రౌపది ముర్ముకు వేద ఆశీర్వచనం ఇచ్చి, ప్రసాదాలు అందించారు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేదపండితులు. ద్రౌపది ముర్మును మనమంతా గెలిపించుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్. సామాజిక న్యాయం వైపు ఉన్నామన్నారు.
తరువాత ఆమె టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్ది ముర్ముతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా భేటీ అయ్యారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకోవడం ఎంతో గొప్ప నిర్ణయమన్నారు చంద్రబాబు. ఏపీలో అన్ని పార్టీలు రాష్ట్రపతి అభ్యర్దికి మద్దతు తెలుపడం విశేషం.