ఎండలు తగ్గాలంటూ వరంగల్ వాసుల పూజలు
వరంగల్ జిల్లా ఖాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి ఆలయంలో ఎండలు తగ్గించమంటూ పూజలు మొదలుపెట్టారు భక్తులు. రాబోయే మూడురోజులు ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుతాయనే వార్తలు వస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. సూర్యభగవానుడా శాంతించమంటూ వేడుకుంటున్నారు. 108 కొబ్బరికాయలతో మొక్కులు తీర్చుకుంటూ, దేశంలోని (7)సప్త నదుల నుండి తెచ్చిన నీటితో గణపతి అభిషేకాలు చేస్తున్నారు. సూర్యుడు మేషరాశి నుండి వృషభరాశిలో ప్రవేశించబోతున్నాడని, దీనితో భరించలేని ఎండలు పెరిగిపోతాయని పండితులు చెప్పడంతో పూజలు ముమ్మరం చేస్తున్నారు భక్తులు. మొన్నటి వరకూ అకాల వర్షాలతో విసిగించిన ప్రకృతికి ఇది ఎండాకాలమని గుర్తొచ్చిందేమో చుర్రున కాల్చే ఎండతో వాతలు పెడుతున్నాడు సూర్యుడు.

