crimeHome Page SliderNationalNews

ఫోన్ పిచ్చితో కన్నకొడుకునే చంపిన తల్లి..

చేతిలో సెల్‌ఫోన్, దానిలో సోషల్ మీడియా ఎకౌంట్లు ఉంటే చాలు..మనం మనుషులమనే విషయమే మరిచిపోతున్నారు కొందరు. ఉన్మాదుల్లా మారిపోయి కన్నబిడ్డలనే అంతమొందిస్తున్నారు. చెన్నైలోని కీల్పాక్కం ఏరియాకు చెందిన దివ్య(32) అనే మహిళ సోషల్ మీడియా పిచ్చిలో పడి భర్తను వదిలిపెట్టి రావడమే కాకుండా, అతని మీద కోపంతో పసి పిల్లలైన ఇద్దరు కుమారులను చంపి, తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. నిత్యం సెల్‌ఫోన్‌లోని సామాజిక మాధ్యమాలతో గడుపుతున్న ఆమెను భర్త రామ్ కుమార్ (34) మందలించాడు. దీనితో అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను వదిలి, ఇద్దరు కుమారులను లక్ష్మణ్(4), పునీత్ (18 నెలలు) తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. శనివారం భర్త ఫోన్ చేసి కాపురానికి రావల్సిందిగా కోరగా, ఆమె నిరాకరించింది. దీనితో ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీనితో తీవ్ర ఆందోళనకు గురయిన దివ్య చిన్న కుమారుడు పునీత్‌ను బాత్రూంలోకి తీసుకెళ్లి కూరలు తరిగే చాకుతో గొంతు కోసి, హత్య చేసింది. తర్వాత పెద్ద కుమారుడు లక్ష్మణ్‌ను కూడా గొంతుకోయగా, కేకలు వేశాడు. అది విన్న దివ్య మేనత్త అడ్డుకోవడంతో, దివ్య తన గొంతు కోసుకుని పడిపోయింది. దీనితో దివ్యను, లక్ష్మణ్‌ను ఆసుపత్రికి తరలించారు. దివ్య స్వరపేటిక తెగిపోవడంతో ఆమె మాట్లాడలేకపోతోంది. ఆమెపై హత్య, ఆత్మహత్య, హత్యాప్రయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు.