Andhra PradeshcrimeHome Page SliderNews Alertviral

యజమానిని చంపి పరారైన పనిమనిషి

విజయవాడలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంటి యజమానిని దారుణంగా హత్యచేసిన పని మనిషి..ఇంట్లోని బంగారం, నగలతో పరారైంది. బొద్దలూరి వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే పనిమనిషిని పెట్టుకున్నారు. అనూష అదే ఇంట్లో వారితో కలిసి ఉంటోంది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలిగి ఉండటంతో అనుమానం వచ్చిన సరస్వతి వచ్చి చూడగా కుమారుడు అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండటంతో ఆందోళన చెందారు. మంచం మీద, రామారావుపై కారం చల్లి ఉండటాన్ని గమనించారు. పనిమనిషి అనూష కనిపించకపోవడం, బీరువా పగలగొట్టి ఉండటంతో పక్కింటి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. పని మనిషి అనూషను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితురాలు తన భర్త సాయంతో రామారావు ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.