NewsTelangana

పీవోపీ విగ్రహాలు ఓకే… సాగర్‌లో నిమజ్జనానికి నో పర్మిషన్..

Share with

త్వరలో వినాయక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. పివోపి విగ్రహాల తయారీ ,విక్రయాలపై ఎటువంటి నిషేధాలు లేవని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. అయితే హుస్సేన్ సాగర్‌లో మాత్రం విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని సూచించింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన నీటి కుంటలలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని, అప్పుడు ఏర్పడే వ్యర్ధాలను వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) జారీచేసిన మార్గదర్శకాల చట్టబద్ధతను తుది విచారణలో తెలుస్తామని పేర్కొంది.

సీపీసీబీ మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ గణేష్‌మూర్తి కళాకార్ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అదే విధంగా కరోనాకు ముందు తయారు చేసిన విగ్రహాలను విక్రయించుకోడానికి అనుమంతించేలా జీహెచ్ఎంసీని ఆదేశించాలంటూ మరో పిటిషన్ దాఖలయ్యింది. రెండు పిటిషన్‌లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరుపు న్యాయవాది ఎం.ఎస్.దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ ..పీవోపీ కాలుష్య కారకమన్నా అంశంపై సీపీసీబీ ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేయలేదన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఒక్క ఏడాదికే వర్తిస్తాయని వాదనలో ప్రస్తావించారు. ఈ ప్రస్తావనలో జోక్యం చేసుకున్న కోర్టు గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము సవరించలేమని… వాటి కొనసాగింపు అలానే ఉంటుందని పేర్కొంది. అదే విధంగా విగ్రహాల తయారీనీ ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నవారి జీవనోపాధికి ఆటంకం కలిగించకూడనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వ న్యాయవాది పి.రాధీవ్ రెడ్డి జోక్యం చేసుకుంటూ కనీసం విగ్రహాల పరిమాణాన్ని తగ్గించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరగా..కొత్త అంశాలను తెరపైకి తీసుకురావొద్దంటూ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.