NewsTelangana

రంగంలో అమిత్ షా.. ఇక నెల నెలా తెలంగాణ టూర్

Share with

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న కొద్దీ బీజేపీ అగ్రనాయకత్వం.. స్పెషల్ ఫోకస్ పెంచుతోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన పార్టీ పెద్దలు ఇప్పుడు తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలోనే రాష్ట్రానికి రాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే దాకా ప్రతి నెలలో రెండు రోజులు తెలంగాణ పర్యటనకు రానున్నట్టు తెలుస్తోంది. మరో ఏడాదిన్నరలోగా రాష్ట్రంలో ఎన్నికలుంటాయనే అంచనాలతో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌ షాలతో కూడిన అగ్రనాయకత్వం తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టింది.

హైదరాబాద్‌లో ఈ నెల 2, 3 తేదీల్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ‘మిషన్‌ తెలంగాణ’ రోడ్‌మ్యాప్‌ను తయారుచేసారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, వ్యూహాలన్నీ పూర్తిగా జాతీయ నాయకత్వం, అమిత్‌ షా కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్‌ షా రాష్ట్ర పర్యటనలకు ప్రాధాన్యత ఏర్పడింది. అధికార టీఆర్‌ఎస్‌పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలు, కుటుంబపాలన, పాలనా వైఫల్యాలు, హామీల అమల్లో వైఫల్యం వంటి అంశాలను విమర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర నాయకత్వానికి… జాతీయ నాయకులు క్లారిటీ ఇచ్చారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వచ్చే నెల 2 నుంచి మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సమయంలో వరంగల్‌లో జరగబోయే బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొనవచ్చని సమాచారం. దీనితో పాటురాష్ట్రం మొత్తం తిరిగేలా  బైక్‌ ర్యాలీలు చేపట్టాలంటూ ఇంతకుముందే అమిత్‌షా రాష్ట్ర బీజేపీపార్టీని దిశానిర్ధేశం చేసారు. అందుకు తగినట్లుగానే గురువారం నుంచి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యనేతల బైక్‌ ర్యాలీలను రాష్ట్ర పార్టీ ప్రారంభించింది. త్వరలోనే రాష్ట్రమంతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బైక్ ర్యాలీలు చేయనున్నారు. అమిత్‌షా ఆదేశాలమేరకు తరచూ బైక్ ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తూ గ్రామాలలో కూడా మోదీసర్కారు విజయాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేయాలని కార్యకర్తలందరూ అంకితభావంతో పనిచేసి, పార్టీ విజయానికి సహకరించాలని జాతీయనాయకత్వం విజ్ఞప్తి చేసింది.