నేతన్నల కష్టాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో దాదాపు 25 వేల పవర్ లూమ్స్ నడుస్తున్నప్పటికీ, విద్యుత్ చార్జీలు, సబ్సిడీ సమస్యల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేఖలో వివరించారు. గతంలో బతుకమ్మ చీరల పథకం ద్వారా నేత కార్మికులకు పని, స్థిరమైన ఆదాయం లభించిందని ప్రస్తుత ప్రభుత్వం లో మాత్రం ఆ సమస్యలు తిరిగి కార్మికుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి అని కేటీఆర్ గుర్తు చేశారు .
కేటీఆర్ లేఖ ప్రకారం, అవగాహన లోపం కారణంగా ముందుగా కూటీర పరిశ్రమల కేటగిరీ కింద ఉన్న అనేక పవర్ లూమ్ యూనిట్లు ఎస్ఎస్ఐ యూనిట్లుగా మారి, ఇండస్ట్రీ–3 కేటగిరీలోకి వెళ్లాయి. దీని ఫలితంగా హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు, 191 ఇతర యూనిట్లకు కలిపి రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలు విధించబడ్డాయి. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేయాల్సిన రూ.101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇంకా ఇవ్వకపోవడంతో, సిరిసిల్ల కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని, TSSPDCLకి చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు ఖర్చులను కూడా చెల్లించలేకపోతున్నదని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో కార్మికులను, వారి కుటుంబాలను కాపాడటానికి ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి రూ.35.48 కోట్ల బకాయిలను మాఫీ చేసి, రూ.101.77 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలని కేటీఆర్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

