ఆర్థిక రంగం గడ్డు స్థితి.. 18 వేల ఉద్యోగులపై అమెజాన్ వేటు
కొన్ని పాత్రల తొలగింపునకు అమెజాన్ నిర్ణయం
నిర్ణయాలు తేలిగ్గా తీసుకోలేమన్న సీఈవో ఆండీ జాస్సీ
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెజాన్ ఫోర్స్‌లో 18 వేల ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఆర్థికరంగం ఎలా ఉంటుందో అర్థం కావడం లేదంది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన వేళ పెద్ద సంఖ్యలో అమెజాన్ ఉద్యోగుల నియామకాలు చేపట్టింది. గత నవంబర్‌లో ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన ప్రకటన విడుదల చేశామని.. తాజాగా మరో 18 వేల మందిని తప్పించాలనుకుంటున్నట్టుగా అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ ప్రకటన విడుదల చేశారు. గత నవంబర్‌లో అమెజాన్ 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో వివిధ హోదాల్లో ఉన్న వారిని బాధ్యతల నుంచి తప్పించడం కష్టమని తెలుసని… ఈ నిర్ణయాలను తీసుకోవడం కష్టమైనా తప్పట్లేదన్నారు అమెజాన్ సీఈవో. అయితే ఇప్పుడు తొలగిస్తున్న ఉద్యోగులకు పూర్తి మద్దతుగా నిలుస్తామన్నారు. తొలగింపు సందర్భంగా ప్రత్యేక చెల్లింపులతోపాటుగా, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అందిస్తున్నామన్నారు. 18 వేల మంది బయట కంపెనీల్లో ఉద్యోగాలు పొందేందుకు అమెజాన్ పూర్తి స్థాయిలో సహకరిస్తోందని అమెజాన్ సీఈవో వెల్లడించారు.
మెజార్టీ తొలగింపులు యూరప్‌లో ఉంటాయని, జనవరి 18 నుండి ప్రభావితమైన కార్మికులకు సమాచారం అందించామన్నారు జాస్సీ. ఈ సమాచారాన్ని కొందరు అమెజాన్ ఉద్యోగులు బయటకు లీక్ చేయడం వల్ల అకస్మాత్తుగా ప్రకటన చేయాల్సివచ్చిందన్నారు. అమెజాన్ గతంలో అనిశ్చితి, కష్టతరమైన ఆర్థిక వ్యవస్థలను ఎదుర్కొందని, ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు వచ్చాయని జాస్సీ చెప్పారు. కరోనా ఉధృతి కారణంగా.. సరుకు రవాణా చేయడానికి 2020, 2022 ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా… సిబ్బందిని అమెజాన్ డబుల్ చేసింది. రిటైల్ రంగంలో వచ్చిన అడ్వాంటేజ్ అందుకునేందుకు ప్రయత్నించింది. ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ కంపెనీల్లో 15 లక్షల మందికి పైగా ఉద్యోగులతోపాటు, లక్షల మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటారు.

