జమిలి ఎలక్షన్‌లకు రంగం సిద్దం
లోక్‌సభ ఎన్నికలు అయినా,రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా, పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా, ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. ఎన్నికలు తరచూ జరగడం మూలంగా సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు, వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడుతోందని కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మనసులోని ఈ మాట ఈనాటిది కాదు. ఒన్ నేషన్ -ఒన్ ఎలక్షన్ అనే అంశంపై ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. నీతీ ఆయోగ్ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాల్సిఉంటుంది. కాగా ఈరోజు జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.
లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయంగా లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికల అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు తెలిపారు. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు అయ్యిందని కేంద్ర న్యాయశాఖ కిరణ్ రిజిజుపేర్కొన్నారు. స్టాండింగ్ కమిటీ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని, ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోందన్నారు.