నిజం చెబితే చంపాలని చూస్తున్నారన్న ఎంపీ రఘురామ
ఏడాదికాలంగా కార్పొరేషన్ పేరిట అప్పులు తప్పని చెప్పానన్నారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. రోగ్ అని తిట్టారని… పార్లమెంట్లో అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఆర్.బి.ఐ కూడా తాను చెప్పిన విషయాన్ని చెబుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. నెల రోజుల క్రితం ఆర్బీఐ ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ, ఇప్పుడు సర్కులర్ కాపీ వెలుగులోకి వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, రుణాలను పొంది, వాటిని సంక్షేమం, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించి, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తామంటే కుదరదని ఆర్బిఐ తన ఉత్తర్వులలో పేర్కొన్నదని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ, రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడి అప్పులు చేస్తోందన్నారు. అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ ఐతే… ఆర్థిక శాఖ మంత్రితో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా అభినయించిన వ్యక్తి, బ్యాంక్ చైర్మన్, ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాల్సి వస్తోందని హెచ్చరించారు.
దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్టీ రామారావు మూడు పాత్రలను పోషించినట్టుగా, సకల శాఖామంత్రి విద్యావేత్తగా, ఇంజనీర్ గా, ఆర్దికవేత్తగా మూడు పాత్రలను పోషించారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రిగా అవతారం ఎత్తిన సకల శాఖ మంత్రి… రాష్ట్ర ప్రభుత్వం చేసింది 8 లక్షల కోట్ల అప్పు కాదని, కేవలం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమేనని చెప్పుకొచ్చారన్నారు. అప్పులను, తప్పులను నొక్కి వేయడం తమవారికి అలవాటైందని విమర్శించారు. 1,50,000 కోట్ల రూపాయల బాకీలే ఉన్నాయని రఘురామ పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి సాక్షి దినపత్రిక కు, తమను బాగా చూసుకునే కాంట్రాక్టర్లకు మినహా ఎవరికీ బిల్లులు చెల్లించ లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పాఠశాలల విలీన ప్రక్రియ నిర్ణయం వల్ల దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడి, ప్రైవేటు పాఠశాలలను చేరారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అంటే మొత్తం విద్యార్థులలో ఇప్పటికే 20 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడగా, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోతున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వ తప్పిదం ఉన్నట్లు అంగీకరించడం అభినందనీయమని రఘురామకృష్ణం రాజు అన్నారు. 8 ఏళ్ల ప్రభుత్వంలో, ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నదని, గత మూడేళ్లుగా తాము అధికారంలో ఉన్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో రెండు ప్రభుత్వాల తప్పిదం ఉన్నదని మంత్రి అంబటి రాంబాబు అంగీకరించారన్నారు.
గోదావరి జిల్లాలలో సంభవించిన విపత్తుకు సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అడగలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏదైనా కష్టం వస్తే అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, తీర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నదన్నారు. అడగకపోతే కేంద్రం ఎందుకు సహాయం చేస్తుందని ప్రశ్నించారు. తన నియోజకవర్గ పరిధిలోని పలులంక గ్రామాలలో విద్యార్థి కంటే హుషారుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వరద బాధితులను పరామర్శిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు కితాబు ఇచ్చారు. ప్రతిపక్ష నేత బోట్లు వేసుకొని ప్రజల వద్దకు వెళుతుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేశారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ముంపు గ్రామాలైన, తన నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాలలో పర్యటించలేకపోవడం తన దురదృష్టమని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనని చూస్తే ప్రభుత్వ పెద్దలకు భయం ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు.
హోం మంత్రిత్వ శాఖ అనుమతి లేని సాక్షి ఛానల్ తక్షణమే మూసివేయాలని, ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్, ఎం. ఓ. ఎస్ మురుగన్ ను కలిసి తాను స్వయంగా లేఖలను అందజేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉచితంగా లభించే ఇసుక, ప్రస్తుతం పాతిక వేల రూపాయలకు విక్రయిస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. తమ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఈ ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్న యోజన పథకాన్ని గత నాలుగు నెలలుగా అమలు చేయకపోవడం పట్ల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. కేంద్రమంత్రి జయశంకర్ చెప్పిందే, తాను పార్లమెంట్లో మాట్లాడబోతే తమ పార్టీకి చెందినవారు మాటల దాడి చేశారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.